Team India: పిచ్‌లపై విమర్శలు.. భారత్‌కు అండగా నిలిచిన పాక్ మాజీ క్రికెటర్లు
ఈ వార్తాకథనం ఏంటి
ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచకప్ ఫైనల్ లో న్యూజిలాండ్ ను ఓడించిన టీమిండియా వరుసగా రెండోసారి టైటిల్‌ను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఈ విజయంతో భారత్ మూడుసార్లు టీ20 ప్రపంచకప్‌ను గెలిచిన తొలి జట్టుగా నిలిచింది. టోర్నమెంట్ మొత్తం టీమిండియా అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచింది. ముఖ్యంగా మూడు మ్యాచ్‌లలో 250కి పైగా స్కోర్లు నమోదు చేసి ప్రత్యర్థి జట్లపై ఆధిపత్యం చెలాయించింది. అయితే ఈ అసాధారణ ప్రదర్శనపై కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. ఆతిథ్య దేశంగా భారత్ తమకు అనుకూలంగా ఉండేలా బ్యాటింగ్‌కు అనువైన పిచ్‌లను సిద్ధం చేసుకుందని కొందరు ఆరోపణలు చేశారు.
Details
ప్రతిదాంట్లో తప్పులు వెతకడం మానుకోవాలి
ఇలాంటి సమయంలో చిరకాల ప్రత్యర్థి దేశం పాకిస్థాన్ కు చెందిన మాజీ క్రికెటర్లు ఇమాద్ వసీం, షాహిద్ అఫ్రిది భారత్‌కు మద్దతుగా నిలవడం క్రీడా వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. పిచ్‌లపై వస్తున్న విమర్శలను పక్కనపెట్టి, టీమిండియా ప్రదర్శనను వారు ప్రశంసించారు. ఒక పాకిస్థానీ టీవీ షోలో మాట్లాడిన ఇమాద్ వసీం, "అంపైర్లు భారత్‌కు అనుకూలంగా ఉంటారని, వాళ్లు స్పిన్ పిచ్‌లు తయారు చేసుకుంటారని తరచూ వింటుంటాం. కానీ ఈ టోర్నమెంట్‌లో పిచ్‌లు చాలా సమతూకంగా ఉన్నాయని అంగీకరించాలి. కొన్నిసార్లు పరిస్థితులు భారత్‌కు వ్యతిరేకంగా ఉన్నా కూడా వారు అద్భుతంగా ఆడుతూ ఆధిపత్యం చెలాయించారు. కాబట్టి ప్రతిదాంట్లో తప్పులు వెతకడం మానుకుని, ఒక క్రికెట్ దేశంగా మనం వారిని అభినందించాలి.
Details
టీమిండియాపై షాహిద్ ఆఫ్రిది ప్రశంసలు
పాకిస్థాన్‌తో పాటు మరెన్నో జట్ల కంటే భారత్ పెద్ద జట్టు అనే నిజాన్ని అంగీకరించాల్సిందేనని వ్యాఖ్యానించాడు. ఇమాద్‌తో పాటు పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది కూడా టీమిండియాపై ప్రశంసలు కురిపించాడు. "ఈ టైటిల్‌కు భారత్ పూర్తిగా అర్హమైన జట్టు. వారి జట్టు కూర్పు అద్భుతంగా ఉంది. బెంచ్‌లో ఉన్న ఆటగాళ్లు కూడా తుది జట్టులో ఉన్నవారితో సమానంగా సమర్థులు. అందుకే జట్టుకు బలమైన బెంచ్ అవసరం అని నేను ఎప్పుడూ చెబుతుంటాను. భారత్ బెంచ్ చాలా పటిష్ఠంగా ఉంది. టోర్నీ మొత్తం వారు నిజమైన ఛాంపియన్లలా ఆడారని అఫ్రిది తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియోలో పేర్కొన్నాడు.