Ayush mhatre : ఆయుష్ మాత్రేకు గాయం.. సీఎస్‌కే మేనేజ్‌మెంట్‌పై అశ్విన్ కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో గాయాల నిర్వహణ ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందని మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. ఇటీవల సన్‌రైజర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే యువ బ్యాటర్ ఆయుష్ మాత్రే గాయంతో ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. మ్యాచ్‌కు ముందే అతడు కాలికి బ్యాండేజ్ వేసుకున్నాడు. మొదట అది తేలికపాటి నొప్పి లేదా తిమ్మిరిగా భావించినప్పటికీ, అతని పరిస్థితిని గమనిస్తే గాయం తీవ్రమై ఉండొచ్చని అశ్విన్ అంచనా వేశాడు.
వివరాలు
మోకాలికి బ్యాండేజ్..
"ఆయుష్ మాత్రే గాయపడ్డాడు. అతడు త్వరగా కోలుకుని తిరిగి రావాలని ఆశిస్తున్నాను. కానీ అతని పరిస్థితిని చూస్తే కొన్ని మ్యాచ్‌లకు దూరం కావాల్సి రావొచ్చనే అనుమానం కలుగుతోంది. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు అతని మోకాలి వద్ద బ్యాండేజ్ కనిపించింది. గత రెండు మూడు మ్యాచ్‌లుగా అతడు ఇంపాక్ట్ ప్లేయర్‌గా మాత్రమే బరిలోకి దిగుతున్నాడు. ఎందుకు ఇలా చేస్తున్నాడు? అతను మంచి ఫీల్డర్ కాదా? అనే సందేహాలు అభిమానుల్లో వ్యక్తమయ్యాయి. అతని గాయం ఆందోళన కలిగించే విధంగా ఉంది. నొప్పి ఎక్కువగా ఉన్న సమయంలోనే అతడు మైదానం వీడాల్సింది. కానీ మరో బంతి ఆడి చివరకు ఔటయ్యాడు.
వివరాలు
ఆ వ్యవస్థ సరిగా పనిచేయలేదని కామెంట్
ఫిజియో వచ్చి చికిత్స చేసినా ప్రయోజనం లేకపోయింది. అలాంటి పరిస్థితిలో అతడిని రిటైర్డ్ అవుట్‌గా పంపించకపోవడం అర్థం కావడం లేదు. ప్రస్తుతం సీఎస్‌కేలో మంచి ఫామ్‌లో ఉన్న బ్యాటర్లలో ఆయుష్ మాత్రే ఒకరు. అయినప్పటికీ అతడి విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోలేదనే భావన కలుగుతోంది. సీఎస్‌కే జట్టులో గాయాల నిర్వహణ సరిగా లేదనే అనిపిస్తోంది. ఇదే సమస్య గతంలో దీపక్ చాహర్ విషయంలో కూడా కనిపించింది. అతడు సీఎస్‌కే తరఫున మూడు సంవత్సరాలు ఉన్నప్పటికీ కేవలం 16 మ్యాచ్‌లే ఆడాడు. అయితే ముంబయి జట్టులో ఒకే సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడగలిగాడు. కాబట్టి సీజన్ ప్రారంభానికి ముందే ఇంజరీ మేనేజ్‌మెంట్ వ్యవస్థ సక్రమంగా పనిచేయాలి" అని అశ్విన్ వ్యాఖ్యానించాడు.