David Warner : డేవిడ్ వార్నర్ సంచలన రికార్డు.. ఆసీస్ తరుపున రెండో ఆటగాడిగా!
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ (David Warner) అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఆసీస్ తరుఫున అన్ని ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ప్లేయర్‌గా రికార్డుకెక్కాడు. 37 ఏళ్ల వార్నర్ మెల్ బోర్న్ క్రికెట్ మైదానంలో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో పాకిస్థాన్ పై ఈ ఘనతను సాధించాడు. ఈ క్రమంలో ఆసీస్ దిగ్గజ క్రికెటర్ స్టీవ్ వా రికార్డును వార్నర్ అధిగమించాడు. ఆస్ట్రేలియా తరుపున టెస్టులు, వన్డేలు, టీ20లు కలిపి అత్యధిక పరుగులు చేసిన వారిలో రికీ పాంటింగ్ అగ్రస్థానంలో ఉన్నాడు. 559 అంతర్జాతీయ మ్యాచుల్లో 667 ఇన్నింగ్స్‌లు ఆడి పాంటింగ్ 27,368 పరుగులు చేశాడు.
టెస్టులో ఐదో స్థానంలో ఉన్న వార్నర్
రెండో స్థానంలో వార్నర్ 371 అంతర్జాతీయ మ్యాచుల్లో 460 ఇన్నింగ్స్‌లలో 18,515 రన్స్ చేశాడు. స్టీవ్ వా (18,496) అంతర్జాతీయ పరుగులను అధిగమించి వార్నర్ రెండో స్థానానికి ఎగబాకాడు. ఆసీస్ తరఫున టెస్టులలో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో వార్నర్ ఐదో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో పాంటింగ్ (13,378), బోర్డర్ (11,174), స్టీవ్ వా (10,927), స్టీవ్ స్మిత్ (9,422)లు వార్నర్ కంటే ముందున్నారు. వార్నర్.. 202 ఇన్నింగ్స్‌లలో 8,689 పరగులు చేశాడు.