LOADING...
Deepti Sharma Record: ఐదు వికెట్లతో చెలరేగిన దీప్తి.. మహిళల టీ20 క్రికెట్‌లో కొత్త చరిత్ర
ఐదు వికెట్లతో చెలరేగిన దీప్తి.. మహిళల టీ20 క్రికెట్‌లో కొత్త చరిత్ర

Deepti Sharma Record: ఐదు వికెట్లతో చెలరేగిన దీప్తి.. మహిళల టీ20 క్రికెట్‌లో కొత్త చరిత్ర

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 15, 2026
10:44 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2026లో భారత మహిళల జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై 64 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ విజయంలో స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ కీలక పాత్ర పోషించింది. తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చిన దీప్తి.. ఏకంగా 5 వికెట్లు పడగొట్టి పాకిస్థాన్ బ్యాటింగ్‌ను కుప్పకూల్చింది. కెరీర్‌లోనే అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన ఆమె ఈ ప్రదర్శనతో ప్రపంచ రికార్డును కూడా తన ఖాతాలో వేసుకుంది.

వివరాలు

మహిళల టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్

పాకిస్థాన్‌పై సాధించిన ఈ ఫైఫర్‌తో దీప్తి శర్మ మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచింది. ఆమె మొత్తం వికెట్ల సంఖ్య 166కు చేరుకుంది. దీంతో థాయ్‌లాండ్ స్పిన్నర్ థిపాచా పుత్తావోంగ్ పేరిట ఉన్న 165 వికెట్ల రికార్డును అధిగమించింది. అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో రువాండాకు చెందిన హెన్రియెట్ ఇషిమ్వే 160 వికెట్లతో మూడో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా బౌలర్ మేగన్ షట్ 152 వికెట్లతో నాలుగో స్థానంలో ఉండగా, థాయ్‌లాండ్‌కు చెందిన ఒనిచా కామ్‌చోంఫు 148 వికెట్లతో ఐదో స్థానంలో కొనసాగుతోంది.

వివరాలు

మరో అరుదైన ఘనత

ఈ మ్యాచ్‌లోనే దీప్తి శర్మ మరో విశిష్ట మైలురాయిని అందుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో 350కి పైగా వికెట్లు తీసిన రెండో భారత మహిళా క్రికెటర్‌గా నిలిచింది. ఈ ఘనతను గతంలో భారత దిగ్గజ పేసర్ ఝులన్ గోస్వామి మాత్రమే సాధించింది.

Advertisement

వివరాలు

ఎప్పుడు ఆందోళన చెందలేదు

మ్యాచ్ అనంతరం మాట్లాడిన దీప్తి శర్మ.. ఈ ఏడాది ప్రారంభంలో తాను వికెట్లు తీయలేకపోయినా ఎప్పుడూ ఆందోళన చెందలేదని తెలిపింది. "సరైన సమయం వచ్చినప్పుడు నేను జట్టుకు ఉపయోగపడతాననే నమ్మకం నాకు ఎప్పుడూ ఉండేది. ఈ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా మారింది. అందుకే వేగాన్ని మారుస్తూ సరైన ప్రాంతాల్లో బంతులు వేసేందుకు ప్రయత్నించాను. అలాగే స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ మధ్య నెలకొన్న 91 పరుగుల భాగస్వామ్యం కూడా విజయానికి కీలకంగా నిలిచిందని దీప్తి పేర్కొంది

Advertisement

వివరాలు

హర్మన్‌ప్రీత్ ప్రశంసలు

భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా దీప్తి శర్మ, స్మృతి మంధాన ప్రదర్శనలను ప్రశంసించింది. జట్టుకు అవసరమైన ప్రతిసారీ స్మృతి, దీప్తి ముందుకొచ్చి బాధ్యత తీసుకుంటారు. ఈ మ్యాచ్‌లో కూడా అదే జరిగింది. ప్రతి లీగ్ మ్యాచ్ కీలకం. పాకిస్థాన్‌పై ఇలాంటి భారీ విజయం సాధించడం జట్టుకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని హర్మన్‌ప్రీత్ తెలిపింది.

వివరాలు

ప్రపంచకప్‌లో భారత్ బోణి

దీప్తి శర్మ చారిత్రాత్మక బౌలింగ్, స్మృతి మంధాన అర్ధశతకం తోడవడంతో భారత్ మహిళల టీ20 ప్రపంచకప్‌లో విజయంతో ఖాతా తెరిచింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడు విభాగాల్లోనూ సమిష్టి ప్రదర్శన కనబరిచిన భారత జట్టు టైటిల్ రేసులో తాము బలమైన పోటీదారులమని మరోసారి నిరూపించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. అనంతరం 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ ఆరంభంలో కొంత పోరాటం చేసినప్పటికీ భారత స్పిన్నర్ల ధాటికి తట్టుకోలేకపోయింది. ఒక దశలో 75/3తో నిలిచిన పాక్.. అక్కడి నుంచి వరుసగా వికెట్లు కోల్పోయి 17 ఓవర్లలో 106 పరుగులకే ఆలౌటైంది.

వివరాలు

మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు

1. దీప్తి శర్మ - 166 వికెట్లు 2. తిపచ్చ పుత్తవోంగ్ - 165 వికెట్లు 3. హెన్రియెట్ ఇషిమ్వే - 160 వికెట్లు 4. మేగన్ షట్ - 152 వికెట్లు 5. ఒన్నిచా కమ్‌చోంఫు - 148 వికెట్లు పాకిస్థాన్‌పై అద్భుత ప్రదర్శనతో రికార్డుల మోత మోగించిన దీప్తి శర్మ.. ప్రపంచకప్ ప్రారంభ మ్యాచ్‌లోనే భారత జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించింది.

Advertisement