LOADING...
India T20 Series Win: చివరి బంతికి ఓటమి.. అయినా సిరీస్ భారత్‌దే!
చివరి బంతికి ఓటమి.. అయినా సిరీస్ భారత్‌దే!

India T20 Series Win: చివరి బంతికి ఓటమి.. అయినా సిరీస్ భారత్‌దే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 13, 2025
09:59 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లండ్‌తో జరిగిన ఐదవ, చివరి టీ20 మ్యాచ్‌లో భారత మహిళల జట్టు చివరి బంతికి పరాజయం పాలైనప్పటికీ, సిరీస్‌ను 3-2తో గెలుచుకుని చారిత్రక విజయాన్ని అందుకుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ఇంగ్లండ్ గడ్డపై తొలిసారి రెండు కంటే ఎక్కువ మ్యాచ్‌లు కలిగిన టీ20 సిరీస్‌ను గెలుచుకుని కొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఆఖరి మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు తొలి 15 బంతుల్లోనే రెండు కీలక వికెట్లను కోల్పోయింది. మంచి ఫారమ్‌లో ఉన్న స్మృతి మంధానా, జెమీమా రోడ్రిగ్స్ త్వరగా వెనుదిరగడంతో భారత్‌కు భారీ షాక్ తగిలింది.

Details

రాణించిన షెఫాలీ వర్మ

అయితే ఓపెనర్ షెఫాలీ వర్మ మాత్రం ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడి ధాటిగా ఆడింది. ఆమె 41 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్సర్ సహా 75 పరుగులు చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించింది. మిగిలిన బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయినా, భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌కు 168 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు నిర్దేశించింది. ఛేదనలో ఇంగ్లండ్ ఓపెనర్లు సోఫియా డంక్లీ (46), డేనియల్ వ్యాట్-హాజ్ (56) మొదటి వికెట్‌కు 101 పరుగుల భాగస్వామ్యం అందించి మ్యాచ్‌పై పట్టుబిగించారు. కానీ వారి ఔట్ అనంతరం భారత బౌలర్లు మ్యాచ్‌ను తిరగద్రిక్కే ప్రయత్నం చేశారు.

Details

చివరి బంతికి ఇంగ్లండ్ గెలుపు

కట్టుదిట్టమైన బౌలింగ్‌తో చివరి ఓవర్‌లో ఒత్తిడి పెంచినా, చివరి బంతికి ఇంగ్లండ్ లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. ఈ ఓటమి తత్ఫలితంగా మ్యాచ్ చేజారినా, సిరీస్ విషయానికొస్తే భారత్ ఇప్పటికే మూడు మ్యాచ్‌లు గెలిచి 3-2తో విజేతగా నిలిచింది. ఇంగ్లండ్ గడ్డపై ఇంతవరకు ఎప్పుడూ సాధించలేని ఘనతను ఈసారి సాధించింది. హర్మన్‌ప్రీత్ సేనకు ఇది గొప్ప గౌరవం మాత్రమే కాదు, భారత మహిళా క్రికెట్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలవనుంది.