Delhi Capitals: యూపీపై విజయం.. మూడో స్ధానాన్ని కైవసం చేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్
ఈ వార్తాకథనం ఏంటి
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో చివరి వరకూ ఉత్కంఠ రేపిన మూడో స్థానాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ కైవసం చేసుకుంది. ఆదివారం యూపీ వారియర్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించి నాకౌట్ దశకు అర్హత సాధించింది. స్వల్ప లక్ష్య ఛేదనలో ఆరంభంలో తడబడిన క్యాపిటల్స్‌ను మధ్య ఓవర్లలో లారా వోల్వార్ట్ (47) ఆదుకోగా, చివర్లో కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్ (18 బంతుల్లో 34*, 5 ఫోర్లు) సంయమనంతో బ్యాటింగ్ చేసి జట్టును విజయతీరాలకు చేర్చారు. యూపీ వారియర్స్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఢిల్లీ 18.4 ఓవర్లలో చేధించింది.
Details
ఎలిమినేటర్ మ్యాచ్‌లో గుజరాత్ తో ఢీ
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 122 పరుగులకే పరిమితమైంది. ఆ జట్టులో దీప్తి శర్మ 24 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, ఆల్‌రౌండర్ శిఖా పాండే 23* పరుగులతో ఫర్వాలేదనిపించింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఈ విజయంతో యూపీ వారియర్స్‌తో పాటు డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌ను కూడా లీగ్ దశలోనే టోర్నీ నుంచి బయటకు నెట్టింది. ఇక మంగళవారం జరగనున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ గుజరాత్ జట్టుతో తలపడనుంది.