Loading...
MS Dhoni: ధోని స్పెషల్.. నిశ్శబ్దంగా ముగిసిన '7' జెర్సీ ప్రయాణం
ధోని స్పెషల్.. నిశ్శబ్దంగా ముగిసిన '7' జెర్సీ ప్రయాణం

MS Dhoni: ధోని స్పెషల్.. నిశ్శబ్దంగా ముగిసిన '7' జెర్సీ ప్రయాణం

వ్రాసిన వారు Moogati Shabari
Aug 15, 2026
02:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

మూడు ఐసీసీ ట్రోఫీలను భారత్‌కు అందించిన కెప్టెన్‌.. జాతీయ జట్టును అత్యున్నత స్థాయికి చేర్చిన నాయకుడు.. వికెట్‌ కీపర్‌గా కూడా తనదైన ముద్ర వేసిన ఆటగాడు.. ఇలాంటి దిగ్గజ క్రికెటర్‌కు వీడ్కోలు అంటే ఎంతో ఘనంగా ఉండాలని అభిమానులు భావిస్తారు. కానీ, 'కెప్టెన్ కూల్‌'గా పేరొందిన మహేంద్ర సింగ్ ధోనికి మాత్రం అలాంటి హంగులు, ఆర్భాటాలు ఏవీ అవసరం అనిపించలేదు. అంతర్జాతీయ క్రికెట్‌లో తనకు ఎంతో ప్రత్యేకమైన '7' నంబర్ జెర్సీకి ధోని ఎలాంటి హడావుడి లేకుండానే వీడ్కోలు పలికాడు. 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి ఇప్పటికే ఆరేళ్లు పూర్తయ్యాయి. అయినప్పటికీ ధోని సాధించిన రికార్డులు, భారత క్రికెట్‌కు అందించిన సేవలు ఇప్పటికీ అభిమానుల జ్ఞాపకాల్లో సజీవంగానే ఉన్నాయి.

వివరాలు

రిటైర్మెంట్ ప్రకటన కూడా ధోని స్టైలే..

అందులోనూ దేశ స్వాతంత్య్ర దినోత్సవం రోజునే తన అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలకడం మరింత ప్రత్యేకంగా నిలిచింది.

ఇటీవల భారత మాజీ క్రికెటర్ అజింక్య రహానే సోషల్ మీడియా ద్వారా తన రిటైర్మెంట్ విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు.

క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు పోస్టు చేశాడు. గతంలోనూ పలువురు ఆటగాళ్లు ఇదే తరహాలో తమ నిర్ణయాలను వెల్లడించారు.

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా టెస్టులు, టీ20లకు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే.

అయితే, ప్రచారానికి దూరంగా ఉండే ధోని మాత్రం తన రిటైర్మెంట్‌ను ప్రకటించిన తీరు కూడా అందరినీ ఆకట్టుకునేలా చేసింది.

వివరాలు`

ఫేర్‌వెల్ మ్యాచ్ కూడా వద్దనుకున్నాడు..

సాధారణంగా ఓ క్రికెటర్ అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నప్పుడు ముందుగా జట్టు మేనేజ్‌మెంట్‌కు సమాచారం ఇస్తాడు.

ఆ తర్వాత అతడికి ప్రత్యేకంగా చివరి మ్యాచ్‌ ఆడే అవకాశం కల్పించి, ఘనంగా వీడ్కోలు పలకడం క్రికెట్‌లో ఆనవాయితీగా వస్తోంది.

కానీ ధోని విషయంలో అలాంటిదేమీ జరగలేదు. తనకు ప్రత్యేకమైన ఫేర్‌వెల్ మ్యాచ్ అవసరం లేదన్నట్లుగా అతడు వ్యవహరించాడు.

భారత్ తరఫున ధోని చివరి అంతర్జాతీయ మ్యాచ్ 2019 జులైలో జరిగింది.

ఆ మ్యాచ్ తర్వాత సుమారు 13 నెలల పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు.

ఆ తర్వాత ఎలాంటి ముందస్తు హడావుడి లేకుండా 2020 ఆగస్టు 15న రిటైర్మెంట్ ప్రకటించి అభిమానులను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేశాడు.

ADVERTISEMENT