Dhoni: ఎంఎస్ ధోని క్రేజ్ అంటే ఇదే.. వేలంలో రికార్డు ధర పలికిన మహీ బ్యాట్
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన ఆట తీరుతో ప్రపంచం నలువైపులా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ధోని బ్యాటు పట్టుకొని మైదానంలోకి దిగితే మైదానంలో మొత్తం ధోని నామస్మరణంలో మారుమ్రోగుతుంది. మహీ క్రీజులో ఉన్నాడంటే చాలు ప్రత్యర్థ బౌలర్లకు చెమటలు పట్టాల్సిందే. చివరి ఓవర్లో క్రీజులోకి వచ్చి సిక్సర్ల మోతతో ఎన్నోసార్లు జట్టును విజయతీరాలకు చేర్చాడు. ధోని జీవిత చరిత్ర ఆధారంగా MS ధోనీ ది ఆన్ టోల్డ్ స్టోరీ పేరుతో ఓ సినిమా కూడా వచ్చింది. తాజాగా ఎంఎస్ ధోని ఉపయోగించిన బ్యాట్ సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది.
రూ.83 లక్షలు పలికిన ధోని బ్యాట్
2011 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచులో శ్రీలంక బౌలర్ కులశేఖర బౌలింగ్‌లో ధోని కొట్టిన సిక్స్ ఇప్పటికి అభిమానుల మదిలో చిరకాలంగా గుర్తిండిపోతుంది. ప్రస్తుతం 2011 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచులో ధోనీ సిక్స్ కొట్టిన బ్యాట్ మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా ఈ బ్యాట్ కు వేలం నిర్వహించారు. లండన్‌లోని ఓ చారిటీ ఈవెంట్ లో ఆ బ్యాట్ ను వేలం వేశారు. ఈ వేలంలో బ్యాట్ ఏకంగా రూ.83 లక్షలు పలకడం విశేషం. ఆర్కే గ్లోబల్ షేర్స్ అండ్ సెక్యూరిటీ లిమిటెడ్ కంపెనీ భారీ ధరకు ఆ బ్యాట్ కు కొనుగోలు చేసింది. అయితే ఈ డబ్బును ధోని దంపతులు సాక్షి ఫౌండేషన్ కు వినియోగించనున్నట్లు తెలుస్తోంది.