T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ లో యువ ప్లేయర్స్.. మ్యాచ్ విన్నర్లుగా మారే 8 మంది ఎవరో తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే చాలా జట్లు తమ తుది జట్లను ప్రకటించాయి. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో అనుభవజ్ఞులైన స్టార్ ఆటగాళ్లతో పాటు, యువ క్రికెటర్లు కూడా తమ ప్రతిభను ప్రపంచానికి చాటేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ప్రపంచకప్‌లో ప్రత్యేకంగా ఆకట్టుకునే అవకాశమున్న ఎనిమిది మంది యువ ఆటగాళ్లపై ఓసారి దృష్టి పెడదాం.
Details
ఆస్ట్రేలియాకు ఎక్స్-ఫాక్టర్.. కూపర్ కొన్నోలీ
22 ఏళ్ల ఆల్‌రౌండర్ కూపర్ కొన్నోలీ ఈ టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా జట్టుకు కీలక అస్త్రంగా మారనున్నారు. ఎడమచేతి వాటం స్పిన్‌తో పాటు విస్ఫోటక బ్యాటింగ్‌కి పేరుగాంచిన కొన్నోలీ, 2025-26 బీబీఎల్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఈ సీజన్‌లో 15.38 సగటుతో 13 వికెట్లు పడగొట్టాడు. హోబార్ట్‌పై 3/23 ప్రదర్శన అతని సామర్థ్యానికి నిదర్శనం. నెదర్లాండ్స్ ఆశలన్నీ మైఖేల్ లెవిట్ పైనే 22 ఏళ్ల ఓపెనర్ మైఖేల్ లెవిట్ నెదర్లాండ్స్ జట్టుకు కీలక ఆటగాడు. 140కి పైగా స్ట్రైక్ రేట్‌తో దూకుడుగా బ్యాటింగ్ చేసే లెవిట్, 2025 యూరప్ రీజియన్ ఫైనల్ క్వాలిఫయర్‌లో ఇటలీపై 25 బంతుల్లో 34 పరుగులు చేశాడు. గ్వెర్న్సీపై 3/11 ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.
Details
అఫ్గానిస్థాన్ బ్యాటింగ్‌కు ఇబ్రహీం జాద్రాన్ బలం
అఫ్గానిస్థాన్ వైస్ కెప్టెన్ ఇబ్రహీం జాద్రాన్ ప్రస్తుతం అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. 24 ఏళ్ల ఈ ఓపెనర్, 2026 జనవరిలో వెస్టిండీస్‌పై తొలి టీ20లో 56 బంతుల్లో 87* పరుగులు చేశాడు. జింబాబ్వేపై వరుసగా నాలుగు టీ20 అర్ధశతకాలతో చెలరేగాడు. గ్రూప్ డీలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాతో ఆడనున్న అఫ్గాన్ జట్టుకు జాద్రాన్ కీలక బాధ్యతలు మోసే అవకాశం ఉంది.
Details
'బేబీ ఏబీ'గా పేరు తెచ్చుకున్న డెవాల్డ్ బ్రెవిస్
దక్షిణాఫ్రికా యువ బ్యాట్స్‌మన్ డెవాల్డ్ బ్రెవిస్ టీ20 క్రికెట్‌లో ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. 173.70స్ట్రైక్ రేట్‌తో పవర్ హిట్టర్‌గా పేరు పొందిన ఈ 22 ఏళ్ల ఆటగాడు, 2025 ఆగస్టులో ఆస్ట్రేలియాపై 56 బంతుల్లో 125* పరుగులు చేసి రికార్డులు సృష్టించాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న బ్రెవిస్, ఎంఎస్ ధోనీ నుంచి ఎంతో నేర్చుకున్నాడు. భారత పిచ్‌లపై అనుభవం అతనికి అదనపు బలం. జింబాబ్వే ఆశలు: బ్రియాన్ బెన్నెట్ 22 ఏళ్ల బ్యాటింగ్ స్టార్ బ్రియాన్ బెన్నెట్ జింబాబ్వేకు కీలక ఆటగాడిగా మారాడు. 2025లో ఒక సెంచరీతో పాటు 936 పరుగులు (145+ స్ట్రైక్ రేట్) చేశాడు. అగ్రస్థానంలో దూకుడుగా బ్యాటింగ్ చేసే అనుభవం బెన్నెట్ కు ఉంది
Details
న్యూజిలాండ్ వేగం: జాకబ్ డఫీ
న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ జాకబ్ డఫీ 2025లో అద్భుతంగా రాణించాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 17 సగటుతో 81 వికెట్లు పడగొట్టాడు. టీ20ల్లోనే 35 వికెట్లు సాధించాడు. జనవరి 2026లో జరిగిన సూపర్ స్మాష్‌లో నిలకడగా ప్రభావం చూపాడు. అతని ప్రతిభను గుర్తించిన ఆర్‌సీబీ ఐపీఎల్ వేలంలో అతన్ని సొంతం చేసుకుంది. నమీబియా కీలక ఆల్‌రౌండర్.. జాన్ ఫ్రైలింక్ నమీబియా ఆల్‌రౌండర్ జాన్ ఫ్రైలింక్ ఇటీవలి టోర్నమెంట్లలో కీలకంగా మారాడు. 2025 ఆఫ్రికా క్వాలిఫయర్‌లో నైజీరియాపై సెంచరీ సాధించాడు. 130కి పైగా స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేయడంతో పాటు, ఎకనామిక్ సీమ్ బౌలింగ్ అతని బలం. గ్రూప్ ఏలో భారత్, పాకిస్తాన్‌లతో తలపడనున్న నమీబియాకు అతను కీలక ఆటగాడు.
Details
ఐర్లాండ్ జట్టులో కర్టిస్ కాంఫర్
ఐర్లాండ్ ఆల్‌రౌండర్ కర్టిస్ కాంఫర్ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్‌తో పాటు సీమ్ బౌలింగ్‌తో జట్టుకు సమతుల్యతనిస్తున్నాడు. ఇటీవలి టీ20 సిరీస్‌ల్లో అతని ప్రదర్శన నిలకడగా ఉంది. బంగ్లాదేశ్‌పై గెలుపులో అద్భుత ఆల్‌రౌండ్ ప్రదర్శన చేశాడు. శ్రీలంకలోని టర్నింగ్ పిచ్‌లపై అతను కీలక పాత్ర పోషించగలడని విశ్లేషకులు భావిస్తున్నారు.