Loading...
Virat Kohli: 18 నంబర్‌తో కోహ్లీకి అంత అనుబంధమా? వెనుక ఉన్న కథ తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే!
18 నంబర్‌తో కోహ్లీకి అంత అనుబంధమా? వెనుక ఉన్న కథ తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే!

Virat Kohli: 18 నంబర్‌తో కోహ్లీకి అంత అనుబంధమా? వెనుక ఉన్న కథ తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 18, 2026
12:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

క్రికెట్‌ ప్రపంచంలో విరాట్‌ కోహ్లీ పేరు ఓ బ్రాండ్‌. మైదానంలో అతని ఆటతీరు, దూకుడు కోట్లాది మంది అభిమానులను ఆకట్టుకుంటాయి. అదే సమయంలో అతని జెర్సీ నంబర్‌ '18' కూడా ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. అయితే కోహ్లీ ధరించే 18వ నంబర్‌ వెనుక ఓ యాదృచ్ఛిక కేటాయింపు, విషాదకర ఘటన, చారిత్రాత్మక కెరీర్‌ ఆరంభం ఉన్నాయి. అందుకే అది కోహ్లీకి కేవలం ఓ నంబర్‌ మాత్రమే కాదు.. అతని జీవితంలోని భావోద్వేగ ప్రయాణానికి ప్రతీకగా మారింది.

వివరాలు

యాదృచ్ఛికంగానే వచ్చింది..

కోహ్లీ భారత అండర్‌-19 జట్టులో ఉన్న సమయంలో తొలిసారి 18వ నంబర్‌ జెర్సీని కేటాయించారు. అప్పట్లో ఆ నంబర్‌కు అతడి దృష్టిలో ఎలాంటి ప్రత్యేకతా లేదు. అయితే ఆ తర్వాత జరిగిన రెండు కీలక సంఘటనలు 18వ నంబర్‌ను కోహ్లీ జీవితంతో విడదీయరాని బంధంగా మార్చాయి.

అదే 18వ తేదీన తండ్రి మృతి..

2006 డిసెంబర్‌ 18.. అప్పటికి కోహ్లీ వయసు 18 ఏళ్లు. ఢిల్లీ తరఫున కర్ణాటకతో రంజీ ట్రోఫీ మ్యాచ్‌ ఆడుతున్నాడు. అదే రోజు రాత్రి అతని తండ్రి ప్రేమ్‌ కోహ్లీ గుండెపోటుతో అకస్మాత్తుగా కన్నుమూశారు. తండ్రిని కోల్పోయిన తీవ్ర విషాదంలో ఉన్నప్పటికీ.. జట్టు కష్టాల్లో ఉండటంతో కోహ్లీ మరుసటి రోజు బ్యాటింగ్‌కు వెళ్లాడు.

వివరాలు

రెండేళ్లలోనే అదే నంబర్‌ కొత్త వెలుగు..

కీలక ఇన్నింగ్స్‌ ఆడి ఢిల్లీ జట్టును ఆదుకున్న తర్వాతే తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యాడు. తండ్రిని కోల్పోయిన డిసెంబర్‌ 18.. కోహ్లీ జీవితంలో ఎప్పటికీ చెరగని చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఆ విషాద ఘటన జరిగిన రెండేళ్లలోపే 18వ నంబర్‌ కోహ్లీ జీవితంలో మరో కీలక ఘట్టానికి గుర్తుగా మారింది.

2008ఆగస్టు 18న శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ భారత సీనియర్‌ జట్టులోకి అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో అతడు ధరించిన జెర్సీ నంబర్‌ కూడా 18కావడం విశేషం.

తన జీవితంలో అత్యంత విషాదకరమైన రోజు, తన అంతర్జాతీయ కెరీర్‌లో అత్యంత ముఖ్యమైన ఆరంభం.. రెండూ 18వ తేదీనే కావడంతో ఈ నంబర్‌తో తనకు ఓ 'కాస్మిక్‌ కనెక్షన్‌' ఉందని కోహ్లీ స్వయంగా పేర్కొన్నాడు.

ADVERTISEMENT

వివరాలు

తండ్రికి నివాళిగా.. కెరీర్‌కు గుర్తుగా

అప్పటి నుంచి 18వ నంబర్‌ను కోహ్లీ మార్చుకోలేదు. అది తన తండ్రికి నివాళిగా, తన అంతర్జాతీయ కెరీర్‌ ఆరంభానికి గుర్తుగా కొనసాగిస్తున్నాడు.

భారత జట్టు తరఫున అన్ని ఫార్మాట్లలోనూ, ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తరఫున కూడా కోహ్లీ 18వ నంబర్‌ జెర్సీతోనే బరిలోకి దిగుతున్నాడు.

ఇప్పుడు క్రికెట్‌లో '18' అంటే విరాట్‌ కోహ్లీ.. విరాట్‌ కోహ్లీ అంటే '18' అనే స్థాయికి ఆ నంబర్‌ చేరిపోయింది.

ఒకప్పుడు యాదృచ్ఛికంగా కేటాయించిన జెర్సీ నంబర్‌.. చివరకు అతని జీవితంలోని విషాదాన్ని, పోరాటాన్ని, విజయాన్ని గుర్తు చేసే ప్రత్యేక చిహ్నంగా మారింది.

ADVERTISEMENT