Neeraj Chopra : తొమ్మిది నెలల తర్వాత బరిలోకి నీరజ్ చోప్రా
ఈ వార్తాకథనం ఏంటి
దాదాపు తొమ్మిది నెలల విరామం అనంతరం భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మళ్లీ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడానికి సిద్ధమయ్యాడు. శుక్రవారం జరగనున్న దోహా డైమండ్ లీగ్ పోటీలో అతడు తన పునరాగమనాన్ని నమోదు చేయనున్నాడు. రెండు ఒలింపిక్ పతకాలు సాధించిన నీరజ్, గత ఏడాది సెప్టెంబరులో జరిగిన టోక్యో ప్రపంచ ఛాంపియన్‌షిప్స్ సందర్భంగా వెన్ను గాయానికి గురయ్యాడు. ఆ గాయం నుంచి కోలుకున్న తర్వాత కొంతకాలం స్విట్జర్లాండ్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకుని తిరిగి పూర్తి ఫిట్‌నెస్‌ను సాధించాడు.
వివరాలు
తొలి భారత అథ్లెట్‌గా చరిత్ర..
అయితే సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ జావెలిన్‌ను విసరబోతున్న నీరజ్‌కు ఈసారి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల ప్రారంభంలో జరిగిన రోమ్ డైమండ్ లీగ్ పోటీల్లో శ్రీలంకకు చెందిన రుమేశ్ తరంగ పతిరగె 92.62 మీటర్ల త్రోతో అద్భుత ప్రదర్శన కనబర్చాడు. దీంతో దోహా పోటీల్లో కూడా అతడు నీరజ్‌కు బలమైన ప్రత్యర్థిగా నిలవొచ్చు. గత ఏడాది దోహా డైమండ్ లీగ్‌లో నీరజ్ 90.23 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరి, 90 మీటర్ల మార్కును అధిగమించిన తొలి భారత అథ్లెట్‌గా చరిత్ర సృష్టించాడు. ఇప్పుడు సుదీర్ఘ విరామం తర్వాత బరిలోకి దిగుతున్న అతడు మరోసారి తన ప్రతిభను ఎలా చాటుకుంటాడన్నది ఆసక్తికరంగా మారింది.
వివరాలు
గాయంతోనే చివరి పోటీలో పాల్గొన్నా: నీరజ్
తన పునరాగమనంపై స్పందించిన నీరజ్ చోప్రా మాట్లాడుతూ, "2025 టోక్యో ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌కు ముందే నాకు వెన్ను గాయం అయింది. అయినప్పటికీ అది ఆ సీజన్‌లో నా చివరి పోటీ కావడంతో గాయంతోనే బరిలోకి దిగాను. తర్వాత చూస్తే అది సరైన నిర్ణయం కాదని అనిపించింది. ప్రస్తుతం పూర్తిగా కోలుకుని పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాను" అని తెలిపాడు.