Venkatesh Iyer: KKR స్టార్ వెంకటేష్ అయ్యర్.. MBA పూర్తి చేసిన తర్వాత ఫైనాన్స్‌లో పీహెచ్‌డీ
క్రికెటర్లు క్రికెట్ పరిజ్ఞానానికి మాత్రమే పరిమితం కాకుండా విద్యపైన కూడా దృష్టి పెట్టాలని కోల్‌కతా నైట్‌రైడర్స్ స్టార్ ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ అభిప్రాయపడ్డాడు. 2018లో ఫైనాన్స్‌లో ఎంబీఏ పూర్తి చేసిన ఆయన, బెంగళూరులోని డెలాయిట్ కంపెనీ నుండి వచ్చిన ఉద్యోగ ఆఫర్‌ను తిరస్కరించాడు. బెంగళూరులో ఉద్యోగం చేస్తూ తన ఇష్టమైన క్రికెట్‌పై పూర్తిగా దృష్టి పెట్టడం కష్టమని భావించి ఆ ఆఫర్‌ని తిరస్కరించాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో, కేకేఆర్ వెంకటేశ్ అయ్యర్‌ను రూ. 23.75 కోట్లకు కొనుగోలు చేసింది.
త్వరలో "డాక్టర్ వెంకటేశ్ అయ్యర్"
ఓ ఇంటర్వ్యూలో అయ్యర్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆయన అభిప్రాయం ప్రకారం, క్రికెటర్లు కేవలం ఆటలో మాత్రమే కాకుండా సాధారణ పరిజ్ఞానం కోసం కూడా చదువుకోవాలి. కనీసం గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడం ముఖ్యం. ప్రస్తుతం తాను ఫైనాన్స్‌లో పీహెచ్‌డీ చేస్తున్నట్లు వెల్లడించారు. త్వరలో "డాక్టర్ వెంకటేశ్ అయ్యర్"గా పిలవబడతానని పేర్కొన్నారు. సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన ఆయనకు, మధ్యతరగతి తల్లిదండ్రులు తమ పిల్లలు కేవలం క్రికెట్‌పైనే ఫోకస్ పెట్టడాన్ని అంగీకరించడం కష్టమని, కానీ తన తల్లిదండ్రులు మాత్రం చదువులోను క్రికెట్‌లోను మంచి ప్రోత్సాహం ఇచ్చారన్నారు.
విద్య జీవితాంతం మనతోనే ఉంటుంది: వెంకటేష్
తన జట్టులో కొత్తగా చేరిన వ్యక్తులను మొదటగా "నీవు చదువుతున్నావా?" అని ప్రశ్నించడం తన అలవాటుగా చెప్పాడు. క్రికెట్ కెరీర్ పరిమిత కాలం మాత్రమే ఉంటుందని, కానీ విద్య జీవితాంతం మనతోనే ఉంటుందని చెప్పారు. బాగా చదువుకుంటే, ఆటలో సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం వస్తుందని, అలాగే జీవితంలోనూ మంచి నిర్ణయాలు తీసుకోవడానికి విద్య ఉపయోగపడుతుందని వెంకటేశ్ అయ్యర్ అభిప్రాయపడ్డాడు. ఒకేసారి రెండు పనులు చేయగలగడం తనకు నచ్చుతుందని, చదువు తన క్రికెట్ ప్రయాణంలో, అలాగే వ్యక్తిగత జీవితంలో సహాయపడుతోందని తెలిపారు.