
PSL : ఉద్రిక్తతల ఎఫెక్టు.. పాక్ సూపర్ లీగ్ మ్యాచ్‌లు యూఏఈకి షిఫ్ట్
ఈ వార్తాకథనం ఏంటి
భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కీలక నిర్ణయం తీసుకుంది.
లీగ్‌లో మిగిలిన ఎనిమిది మ్యాచ్‌లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి తరలిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది.
దేశీయంగా భద్రతా పరిస్థితులు ఆందోళనకరంగా ఉండటంతో ఆటగాళ్ల రక్షణే ప్రాధాన్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
భారత దళాలు పాక్‌పై దాడులు చేసిన తర్వాత రావల్పిండి స్టేడియం సమీపంలో డ్రోన్ కనిపించడం వంటి ఘటనల నేపథ్యంలో పీఎస్ఎల్ స్థానాంతరం చేశారు.
డ్రోన్ల ముప్పు నేపథ్యంలో పీసీబీ చైర్మన్, ఫ్రాంచైజీల యజమానులు, దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నఖ్వీ మధ్య జరిగిన సమావేశాల్లో ఈ విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చారు.
Details
డ్రోన్ ల కలకలంతో వాయిదా
పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ వెల్లడించిన వివరాల ప్రకారం, గురువారం ఉదయం రావల్పిండి నగరంలోని స్టేడియం సమీపంలో భారత్‌కు చెందిన 28 డ్రోన్లను పాకిస్తాన్ సైన్యం తిప్పికొట్టింది.
ఈ డ్రోన్ల ఉద్దేశం దేశీయ, అంతర్జాతీయ క్రికెటర్లను లక్ష్యంగా చేసుకోవడం కావచ్చని ఆయన పేర్కొన్నారు.
కరాచీ కింగ్స్ వర్సెస్ పెషావర్ జల్మి జట్ల మధ్య రావల్పిండి స్టేడియంలో జరగాల్సిన మ్యాచ్, డ్రోన్ కలకలంతో వాయిదా పడింది.
ప్రస్తుతం పీఎస్ఎల్‌లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన మొత్తం 37 మంది విదేశీ ఆటగాళ్లు పాల్గొంటున్నారు.
యూఏఈ వేదికపై మిగిలిన మ్యాచ్‌లు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయన్నదానిపై త్వరలో అధికారిక షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముంది.