LOADING...
Asia Cup: ఎనిమిది ట్రోఫీలు.. ఆసియా కప్ చరిత్రలో భారత్‌కు ఎవ్వరూ సాటిరారు!
ఎనిమిది ట్రోఫీలు.. ఆసియా కప్ చరిత్రలో భారత్‌కు ఎవ్వరూ సాటిరారు!

Asia Cup: ఎనిమిది ట్రోఫీలు.. ఆసియా కప్ చరిత్రలో భారత్‌కు ఎవ్వరూ సాటిరారు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 05, 2025
11:39 am

ఈ వార్తాకథనం ఏంటి

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ఆసియా కప్ 2025 (Asia Cup) ఇంకో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో ఎప్పటిలాగే భారత జట్టు ఫేవరెట్‌గా బరిలోకి దిగబోతోంది. ఇప్పటికే ఎనిమిది టైటిళ్లతో రికార్డు నెలకొల్పిన టీమిండియా ఈసారి కూడా ట్రోఫీపై కన్నేసింది. ముఖ్యంగా ఈసారి టోర్నీ టీ20 ఫార్మాట్‌లో జరుగుతున్నందున, సూర్యకుమార్ యాదవ్‌ ఆధిపత్యం చూపించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఆసియా దేశాల జట్లకు సింహస్వప్నంగా మారిన భారత విజయ ప్రస్థానం మళ్లీ పునరావృతం అవుతుందేమో అన్న ఆసక్తి నెలకొంది.

Details

ఆసియా కప్‌లో భారత్‌ ఆధిపత్యం

ఆసియా వరల్డ్‌కప్‌గా పేరొందిన ఈ టోర్నీ ప్రారంభమైన 1984లోనే భారత్ విజేతగా నిలిచింది. ఆ తర్వాత కూడా అదే జోరును కొనసాగిస్తూ ఇప్పటివరకు ఎనిమిదిసార్లు టైటిల్ గెలుచుకుంది. వీటిలో ఏడు వన్డే ఫార్మాట్‌లో, ఒకటి టీ20 ఫార్మాట్‌లో జరిగినవే. భారత్ 1984, 1988, 1990/91, 1995, 2010, 2016, 2018, 2023లో చాంపియన్‌గా అవతరించింది. శ్రీలంక జట్టు ఆరు టైటిళ్లతో రెండో స్థానంలో ఉండగా, పాకిస్థాన్ మాత్రం మూడు సార్లే విజేతగా నిలిచింది.

Details

గవాస్కర్ నుండి రోహిత్ వరకు...

1984లో యూఏఈ ఆతిథ్యమిచ్చిన తొలి ఆసియా కప్‌లో భారత్, శ్రీలంక, పాకిస్థాన్ మాత్రమే పోటీపడ్డాయి. సునీల్ గవాస్కర్ నాయకత్వంలోని భారత్ ఫైనల్లో శ్రీలంకను ఆరు వికెట్ల తేడాతో ఓడించి చాంపియన్‌గా నిలిచింది. ఆ తర్వాత 1986లో దిలీప్ వెంగ్‌సర్కార్ కెప్టెన్సీలో భారత్ పాకిస్థాన్‌పై విజయం సాధించి రెండో టైటిల్‌ దక్కించుకుంది. 1990, 1995లో మహ్మద్‌ అజారుద్దీన్‌ నాయకత్వంలో భారత్ మరింత బలంగా కప్‌ను కైవసం చేసుకుంది. 2010లో మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో మరోసారి ఆసియాకప్ భారత్ ఖాతాలో చేరింది. 2016లో మళ్లీ ధోనీ సారథ్యంలోనే టీమిండియా విజేతగా నిలిచింది. అనంతరం 2018లో రోహిత్ శర్మ జట్టుకు టైటిల్ అందించగా, 2023లో కూడా అతని నాయకత్వంలోనే భారత్ ఎనిమిదో ఆసియా కప్‌ను గెలుచుకుంది.

Details

ఈసారి లక్ష్యం - తొమ్మిదో ట్రోఫీ!

ఇప్పటికే 8 ట్రోఫీలతో అగ్రస్థానంలో ఉన్న భారత్, తొమ్మిదో టైటిల్ కోసం బరిలోకి దిగబోతోంది. టీ20 ఫార్మాట్‌లో జరుగుతున్న ఈ ఆసియా కప్‌లో భారత జట్టుపై విశ్వాసం, అభిమానుల్లో అంచనాలు ఆకాశానికి చేరాయి.