Glenn maxwell : గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కు షాక్..దక్కని సెంట్రల్ కాంట్రాక్ట్..కెరీర్ ముగిసినట్టేనా?
ఈ వార్తాకథనం ఏంటి
ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు 2026-27 సీజన్‌కు సంబంధించిన సెంట్రల్ కాంట్రాక్ట్‌ల జాబితాను ప్రకటించింది. మొత్తం 21 మంది ఆటగాళ్లకు ఇందులో చోటు లభించింది. అయితే అనుభవజ్ఞుడైన ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కు ఈసారి ఎలాంటి కేటగిరీలోనూ అవకాశం ఇవ్వలేదు. ఆయన చివరిసారిగా 2017లో టెస్టు మ్యాచ్ ఆడిన సంగతి తెలిసిందే. రాబోయే సీజన్‌లో ఎక్కువగా టెస్టు మ్యాచ్‌లు ఆడే ఆటగాళ్లకే ప్రాధాన్యం ఇచ్చినట్లు ఈ జాబితా ద్వారా స్పష్టమవుతోంది. భారత్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ జట్లతో ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లు ఆడనుంది.
వివరాలు
టీ20లకు మాత్రమే పరిమితమైన మ్యాక్స్‌వెల్..
టెస్టు జట్టులో స్థానం లేకపోవడంతో పాటు, మ్యాక్స్‌వెల్ గత ఏడాది వన్డే ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం 37 ఏళ్ల ఈ క్రికెటర్ కేవలం అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లకే పరిమితమయ్యాడు. కానీ గత టీ20 వరల్డ్‌కప్‌లో కూడా అతని ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోయింది. మరో టీ20 ప్రపంచకప్ రెండేళ్ల తరువాత జరగనుండగా, దానికి అనుగుణంగా క్రికెట్ ఆస్ట్రేలియా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలో మ్యాక్స్‌వెల్‌కు మళ్లీ అవకాశం దక్కే అవకాశాలు చాలా తగ్గాయని భావిస్తున్నారు. అందువల్ల అతని అంతర్జాతీయ కెరీర్ దాదాపుగా ముగిసినట్టేనని క్రికెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
వివరాలు
టెస్టులకు ప్రాధాన్యం..
ఈసారి ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను పరిశీలిస్తే టెస్టు ఫార్మాట్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల టెస్టుల నుంచి రిటైర్ అయిన ఉస్మాన్ ఖవాజాకు ఈ జాబితాలో చోటు దక్కలేదు. అలాగే ఓపెనర్ కొన్‌స్టాస్, తరువాతి మ్యాచ్‌ల్లో ఆశించిన రీతిలో రాణించకపోవడంతో అతనికి కూడా అవకాశం ఇవ్వలేదు. ఎంపికైన ఆటగాళ్లు: జేవియర్ బార్ట్‌లెట్, స్కాట్ బార్ట్‌లెట్, అలెక్స్ కేరీ, పాట్ కమిన్స్, బ్రెండన్ డగెట్, నాథన్ ఎలిస్, కామెరూన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కున్హెమన్, మార్నస్ లబుషేన్, నాథన్ లయన్, మిచెల్ మార్ష్, టాడ్ మార్ఫీ, మైకెల్ నెసెర్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, జేక్ వెదర్లాండ్, బ్యూ వెబ్‌స్టర్, ఆడమ్ జంపా