
ENG vs IND : ఇంగ్లండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్‌కు గాయం.. టీమ్‌పై ప్రభావం పడనుందా?
ఈ వార్తాకథనం ఏంటి
లార్డ్స్ మైదానంలో టీమిండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు తొలి రోజు ఆట ఆసక్తికరంగా సాగింది. ఈ మ్యాచ్ తొలి రోజు రెండు జట్లకు మిశ్రమ అనుభవాలు ఎదురయ్యాయి. టీమిండియా తరఫున స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ గాయంతో మైదానాన్ని విడిచిపెట్టగా, ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా చివరి సెషన్‌లో అసౌకర్యానికి గురయ్యాడు. స్టోక్స్ కుడి గజ్జలో నొప్పితో ఇబ్బంది పడుతున్నట్లు కనిపించింది. దీంతో రెండో రోజు అతడు మైదానంలోకి దిగుతాడా? లేదా? అనే విషయంలో ఇంగ్లండ్ అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
Details
పరుగులు చేసే క్రమంలో అసౌకర్యానికి గురైన స్ట్రోక్స్
స్టోక్స్ తన వ్యక్తిగత స్కోరు 32 పరుగుల వద్ద ఉన్న సమయంలో, టీమిండియా బౌలర్ నితీశ్ కుమార్ రెడ్డి ఆఫ్ స్టంప్ వెలుపల వేసిన బంతిని వదిలేశాడు. వెంటనే స్టోక్స్ కుడి కాలు గజ్జ పట్టుకుని నొప్పితో విలవిలలాడాడు. వెంటనే ఫిజియో మైదానంలోకి వచ్చి అతడికి ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర్వాత స్టోక్స్ మళ్లీ బ్యాటింగ్ కొనసాగించినా, పరుగులు తీసే సమయంలో తీవ్రమైన అసౌకర్యానికి గురయ్యాడు. దీంతో అభిమానులు అతడి గాయం గంభీరమేనేమో అనే సందేహంలో పడ్డారు. ఈ గాయంపై మ్యాచ్ అనంతరం ఇంగ్లండ్ వైస్ కెప్టెన్ ఓలీ పోప్ స్పందించాడు. స్టోక్స్ గాయం తీవ్రతపై తనకు పూర్తిగా సమాచారం లేదని చెప్పిన పోప్..అతడు త్వరగా కోలుకుంటాడనే ఆశాభావం వ్యక్తం చేశాడు.
Details
39 పరుగులతో క్రీజులో ఉన్న స్ట్రోక్స్
''రాబోయే నాలుగు రోజులు మాకు చాలా కీలకం. స్టోక్స్ అద్భుత ప్రదర్శనతో మళ్లీ మేము ముందుకు వెళ్లగలమని ఆశిస్తున్నా. రేపటి ఆటలో అతడు ఎలా రాణిస్తాడో చూడాలి. ప్రస్తుతం అతడు వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు'' అని అన్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది. జో రూట్ 99 పరుగులతో, స్టోక్స్ 39 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఐదో వికెట్‌కు వీరిద్దరూ కలసి ఇప్పటివరకు 79 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.