LOADING...
T20 WC 2026: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్‌ టీమ్.. వరుసగా ఐదు సార్లు సెమీస్‌కు..
చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్‌ టీమ్..వరుసగా ఐదు సార్లు సెమీస్‌కు..

T20 WC 2026: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్‌ టీమ్.. వరుసగా ఐదు సార్లు సెమీస్‌కు..

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 25, 2026
12:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లండ్ టీ20 జట్టు కొత్త చరిత్రను సృష్టించింది. పొట్టి ప్రపంచకప్ చరిత్రలో వరుసగా ఐదు ఎడిషన్లలో సెమీఫైనల్‌కు చేరిన తొలి జట్టుగా ప్రపంచ రికార్డును నమోదు చేసింది. ప్రస్తుతం జరుగుతున్న 2026 ఎడిషన్‌లోనూ సెమీస్‌ బెర్త్‌ ఖాయం చేసుకోవడం ద్వారా ఈ ఘనతను అందుకుంది. 2016, 2021, 2022, 2024, 2026 వరల్డ్‌కప్ ఎడిషన్లలో ఇంగ్లండ్ నిరంతరంగా ఫైనల్-4లో స్థానం సంపాదించింది. ఇంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్‌తో పాటు పాకిస్తాన్, శ్రీలంక జట్ల పేరిట సంయుక్తంగా ఉండేది. పాకిస్తాన్ 2007, 2009, 2010, 2012 టోర్నీలలో వరుసగా సెమీస్‌ చేరగా, శ్రీలంక 2009, 2010, 2012, 2014 ఎడిషన్లలో ఫైనల్-4కు అర్హత సాధించింది.

వివరాలు 

చివరి సూపర్-8 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో..

తాజా ఎడిషన్‌లో సెమీస్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచిన ఇంగ్లండ్ ఇప్పుడు తమ మూడో టైటిల్‌పై కన్నేసింది. 2010, 2022 ఎడిషన్లలో ఛాంపియన్‌గా నిలిచిన ఈ జట్టు, సూపర్-8 దశలో పాకిస్తాన్‌పై విజయం సాధించి గ్రూప్-2 నుంచి దృఢంగా సెమీస్‌కు చేరింది. అంతకుముందు ఇదే దశలో ఆతిథ్య శ్రీలంకపై కూడా గెలుపొందింది. ఇక చివరి సూపర్-8 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే, ఇంగ్లండ్ చేతిలో ఓటమి కారణంగా వారి సెమీస్ అవకాశాలు క్లిష్టమయ్యాయి. గ్రూప్-2 నుంచి రెండో సెమీఫైనల్ స్థానానికి న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక జట్లు పోటీ పడుతున్నాయి.

వివరాలు 

గ్రూప్-1లో వెస్టిండీస్, సౌతాఫ్రికా జట్లు సెమీస్ రేసులో

గ్రూప్-1లో వెస్టిండీస్, సౌతాఫ్రికా జట్లు సెమీస్ రేసులో ముందంజలో ఉన్నాయి. సౌతాఫ్రికా చేతిలో భారీ పరాజయం పొందిన భారత్ ఇప్పుడు సెమీస్ ఆశలు నిలబెట్టుకోవాలంటే మిగిలిన మ్యాచ్‌ల్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఉంది. తదుపరి పోరులో టీమిండియా జింబాబ్వే, వెస్టిండీస్ జట్లను ఎదుర్కోనుంది. ఇదిలా ఉండగా, ఫిబ్రవరి 24న పల్లెకెలె వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 2 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించింది. కెప్టెన్ హ్యారీ బ్రూక్ 51 బంతుల్లో 100 పరుగులు (10 ఫోర్లు, 4 సిక్సర్లు) సాధిస్తూ విధ్వంసకర శతకంతో జట్టును విజయానికి నడిపించాడు. ఇతరుల నుంచి పెద్దగా సహకారం లేకపోయినా, బ్రూక్ ఒక్కడే పోరాడి జట్టును గెలిపించాడు.

Advertisement

వివరాలు 

బ్రూక్ అద్భుత ఇన్నింగ్స్‌తో సెమిస్ కు 

అతని బౌండరీలు, భారీ సిక్సర్లు ప్రేక్షకులను అలరించాయి. 165 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కేవలం 17 పరుగులకే ఓపెనర్లను కోల్పోయి ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. ఆ పరిస్థితుల్లో బ్రూక్ అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును గెలుపు దిశగా తీసుకెళ్లాడు. విల్ జాక్స్ (28), సామ్ కర్రన్ (16) స్వల్ప సహకారం అందించారు. బ్రూక్ శతకం ఫలితంగా ఇంగ్లండ్ 19వ ఓవర్ తొలి బంతికే 8 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని అందుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 164 పరుగులు చేసింది. సాహిబ్‌జాదా ఫర్హాన్ 63 పరుగులతో మెరుగైన ప్రదర్శన చేయగా, బాబర్ ఆజమ్ (25), ఫకర్ జమాన్ (25), షాదాబ్ ఖాన్ (23) తగినంతగా తోడ్పడ్డారు.

Advertisement