England: సూపర్-8లోకి ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ఎంట్రీ
ఈ వార్తాకథనం ఏంటి
తొలిసారి ప్రపంచకప్ ఆడుతున్నప్పటికీ ఇటలీ మాజీ చాంపియన్ ఇంగ్లండ్‌ను గట్టిగా బెదరగొట్టింది. 203 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే దిశగా దూసుకెళ్లి ఇంగ్లండ్‌కు షాక్ ఇచ్చేలా కనిపించింది. అయితే కీలక సమయంలో వికెట్ సాధించిన కర్రాన్ మ్యాచ్‌ను మలుపుతిప్పడంతో ఇంగ్లండ్‌కు ఊరట లభించింది. ఈ విజయంతో ఇంగ్లండ్ సూపర్-8 దశకు అర్హత సాధించింది. సోమవారం జరిగిన గ్రూప్ 'సి' పోరులో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 202 పరుగులు చేసింది.
Details
విల్ జాక్స్ సూపర్ ఇన్నింగ్స్
విల్ జాక్స్ కేవలం 22 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 53 పరుగులు చేసి ధనాధన్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. బాంటన్ (30), సాల్ట్ (28) కీలక పరుగులు జోడించారు. కర్రాన్ 25, బెతెల్ 23 పరుగులతో తోడ్పాటునిచ్చారు. ఇటలీ బౌలర్లలో కలుగమగే, గ్రాంట్ స్టివార్ట్ చెరో రెండు వికెట్లు తీశారు. 203 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇటలీ 20 ఓవర్లలో 178 పరుగులకు ఆలౌటైంది. బెన్ మనెంటి 25 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 60 పరుగులు చేసి ఇంగ్లండ్ శిబిరంలో గుబులు రేపాడు. గ్రాంట్ స్టివార్ట్ 23 బంతుల్లో 45 పరుగులు, మోస్కా 43 పరుగులతో పోరాడారు.
Details
మూడు వికెట్లతో మెరిసిన ఓవర్టన్
మనెంటి క్రీజులో ఉన్నంత సేపు ఇటలీ రేస్‌లో నిలిచింది. అయితే అతడిని జాక్స్ ఔట్ చేయడంతో మ్యాచ్ మలుపుతిరిగింది. అనంతరం స్టివార్ట్ భారీ షాట్లతో ఇంగ్లండ్‌ను బెంబేలెత్తించినా, అతని వికెట్‌ను కర్రాన్ సాధించడం కీలకమైంది. ఇంగ్లండ్ బౌలర్లలో ఓవర్టన్ 3/18తో మెరిసాడు. కర్రాన్ 3/22తో కీలక పాత్ర పోషించగా, ఆర్చర్ 2/35తో సహకరించాడు. మొత్తానికి ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో ఇంగ్లండ్ విజయాన్ని అందుకుని సూపర్-8లో అడుగుపెట్టింది.