Moeen Ali: అంతర్జాతీయ క్రికెట్‌కు ఇంగ్లండ్ క్రికెటర్ మొయిన్ అలీ గుడ్ బాయ్
ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పాడు. 37 ఏళ్ల అలీ, 2014లో ఇంగ్లాండ్ తరఫున తొలి మ్యాచ్ ఆడాడు. ఇప్పటివరకు 68 టెస్టులు, 138 వన్డేలు, 92 టీ20లు ఆడిన అలీ, అన్ని ఫార్మాట్లలో కలిపి 6,600కుపైగా పరుగులు చేశాడు.బౌలింగ్‌లో 360కు పైగా వికెట్లు తీసుకున్నాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 67 మ్యాచుల్లో 1,162 పరుగులు చేసి, 35 వికెట్లు తీశాడు. 2023 జూలై 27న ఆస్ట్రేలియాతో చివరి టెస్టు, నవంబర్ 11న పాక్‌పై చివరి వన్డే, భారత్‌తో జూన్ 27న తన చివరి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడాడు.
కొత్త తరం జట్టులోకి రావడానికి ఇదే సమయం: మొయిన్ అలీ
కొత్త తరం క్రికెటర్లకు అవకాశం ఇవ్వాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మొయిన్ అలీ తెలిపాడు. ''నాకు 37 ఏళ్లు వచ్చాయి. ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీస్‌కు ఎంపిక కాలేదు. భవిష్యత్తులో పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. ఇంతవరకు ఇంగ్లాండ్ తరఫున చాలా క్రికెట్ ఆడాను. ఇప్పుడు కొత్త తరం జట్టులోకి రావడానికి సమయం ఆసన్నమైంది. నేను రిటైర్ అవుతున్నప్పటికీ ఎలాంటి బాధ లేదు. ఇంకా క్రికెట్ ఆడగలను, కానీ జట్టు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇదే సరైన సమయం అనిపించింది," అని మొయిన్ అలీ స్పష్టంచేశాడు.