England Cricket Board: టీమిండియా పర్యటన లేక ఇంగ్లాండ్‌కు రూ.627 కోట్ల నష్టం.. ఐసీసీ నిర్ణయంతో మరో షాక్!
ఈ వార్తాకథనం ఏంటి
క్రికెట్‌కు పుట్టినిల్లయిన ఇంగ్లాండే ఇప్పుడు ఆర్థిక సంక్షోభం ముప్పును ఎదుర్కొంటోంది. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ECB) భారీ ఆర్థిక నష్టాన్ని చవిచూసే ప్రమాదం కనిపిస్తోంది. టీమిండియా పర్యటన లేకపోవడం, మరోవైపు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) నుంచి రావాల్సిన ఆదాయంలో కోత పడనుండటంతో ఇంగ్లాండ్ బోర్డుకు దాదాపు 50 మిలియన్ పౌండ్లు (సుమారు రూ.627 కోట్లు) నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ది గార్డియన్ కథనం ప్రకారం.. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో పడటానికి ప్రధానంగా రెండు కారణాలున్నాయి. వాటిలో మొదటిది 2027లో భారత జట్టు ఇంగ్లాండ్‌లో పర్యటించకపోవడం కాగా, రెండోది ఐసీసీ నుంచి వచ్చే బ్రాడ్కాస్ట్ రెవెన్యూలో కోత పడనుండటం.
వివరాలు
టీమిండియా పర్యటన లేక ఆదాయానికి గండి
ఇంగ్లండ్‌లో పర్యటించే జట్లను బట్టి అక్కడి బ్రాడ్‌కాస్టింగ్ ఆదాయం ఆధారపడి ఉంటుంది.
ముఖ్యంగా భారత జట్టు పర్యటనలకు టీవీ వీక్షకాదరణతో పాటు వాణిజ్యపరంగానూ భారీ ప్రాధాన్యం ఉంటుంది.
అయితే 2027లో టీమిండియా ఇంగ్లాండ్‌లో పర్యటించడం లేదు. దీంతో టీవీ వ్యూయర్షిప్, కమర్షియల్ ఆదాయం పరంగా ఈసీబీకి పెద్ద దెబ్బ తగలనుంది.
వివరాలు
ఐసీసీ రెవెన్యూలోనూ కోత
ఇక రెండో కారణం ఐసీసీ తీసుకున్న నిర్ణయం. 2027లో సభ్య దేశాలకు పంచాల్సిన బ్రాడ్కాస్ట్ రెవెన్యూలో కొంత మొత్తాన్ని హోల్డ్‌లో పెట్టాలని ఐసీసీ భావిస్తోంది. ఈ నిర్ణయం ఒక్క ఇంగ్లాండ్‌పైనే కాకుండా మొత్తం 12 ఫుల్ మెంబర్ దేశాలపై ప్రభావం చూపనుంది.
అయితే ఈ నష్టాన్ని కొంతవరకు తగ్గించుకునేందుకు ఈసీబీ ప్రయత్నిస్తోంది. ఐసీసీతో చర్చలు జరిపి రెవెన్యూలో కోత ప్రభావాన్ని తగ్గించాలని కోరుతోంది.
తద్వారా నష్టాన్ని 35 మిలియన్ పౌండ్లకు (సుమారు రూ.439 కోట్లు) పరిమితం చేయాలని చూస్తోంది. ఐసీసీ ఎంత మొత్తాన్ని హోల్డ్‌లో ఉంచుతుందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
2027 ఆర్థిక సంవత్సరం ముగియడానికి జనవరి 31, 2028 వరకు సమయం ఉంది.
వివరాలు
ఐసీసీ ఆదాయాన్ని ఎందుకు నిలిపివేస్తోంది?
ఈలోగా స్పాన్సర్‌షిప్‌లు, ఇతర ఈవెంట్ల ద్వారా ఆదాయాన్ని కొంత పెంచుకోవచ్చని ఈసీబీ ఆశిస్తోంది.
2028 నుంచి ప్రారంభమయ్యే కొత్త రైట్స్ సైకిల్లో బ్రాడ్‌కాస్టింగ్ డీల్ విలువ తగ్గే అవకాశం ఉందని ఐసీసీ అంచనా వేస్తోంది.
ఆ సమయంలో క్రికెట్ బోర్డులపై ఒకేసారి ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు ముందుజాగ్రత్త చర్యగా 2027 పంపకాల నుంచే కొంత మొత్తాన్ని నిలిపివేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
వాస్తవానికి 2027 ప్రస్తుత సైకిల్లో చివరి సంవత్సరం. అదే ఏడాది వన్డే ప్రపంచకప్ కూడా జరగనుంది.
దీంతో సభ్య దేశాలకు ఐసీసీ నుంచి భారీ మొత్తంలో చెల్లింపులు రావాల్సి ఉంది.
అయితే ఐసీసీ తీసుకున్న ఈ ముందస్తు నిర్ణయం ఇప్పుడు క్రికెట్ బోర్డుల ఆర్థిక ప్రణాళికలపై ప్రభావం చూపుతోంది.
వివరాలు
భారత మార్కెట్‌పైనే ఇంగ్లాండ్ బోర్డు ఆశలు
ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఇంతలా ఆందోళన చెందడానికి భారత మార్కెట్‌పై ఉన్న ఆధారపడటమే ప్రధాన కారణం.
అక్కడ టీవీ రైట్స్, వ్యూయర్షిప్ రెవెన్యూ పెరగాలంటే టీమిండియా మ్యాచ్‌లు కీలకంగా మారాయి.
ప్రస్తుతం సోనీ పిక్చర్స్‌తో ఈసీబీకి 185 మిలియన్ పౌండ్ల (సుమారు రూ.2,323 కోట్లు) విలువైన ఆరేళ్ల ఒప్పందం ఉంది. ఈ కాంట్రాక్ట్ 2028తో ముగియనుంది.
ఆ తర్వాత కుదుర్చుకునే కొత్త బ్రాడ్‌కాస్టింగ్ డీల్ విలువ గణనీయంగా తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
వివరాలు
కౌంటీ క్రికెట్‌పైనా ప్రభావం
ఈ ఆర్థిక సంక్షోభ ప్రభావం కేవలం ఈసీబీతోనే ఆగిపోకుండా ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్ వ్యవస్థపైనా పడే అవకాశం ఉంది. బోర్డు ఆదాయం తగ్గితే కౌంటీలకు అందించే ఆర్థిక సహాయాన్ని కూడా తగ్గించాల్సి రావచ్చు.
ఇప్పటికే ఇంగ్లాండ్‌లోని 18 కౌంటీ జట్లలో 10 జట్లు ఆర్థిక నష్టాల్లో కొనసాగుతున్నాయి. వీటిలో చాలా జట్లు ఈసీబీ అందించే నిధులపైనే ఆధారపడి ఉన్నాయి.
దీంతో బోర్డు ఆదాయం తగ్గితే కౌంటీ క్రికెట్ నిర్వహణ కూడా ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంది. 2025లో ఈసీబీ 12.6 మిలియన్ పౌండ్ల లాభాన్ని ఆర్జించింది.
అయినప్పటికీ 2027లో ఆర్థిక పరిస్థితులు కఠినంగా మారతాయని బోర్డు ముందుగానే అంచనా వేసింది.
నష్టం గతంలో ఊహించిన దానికంటే ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది.