WORLD CUP 2023 : ప్రపంచకప్‌లోనే ఇంగ్లండ్ మూడో అత్యధిక స్కోరు ఇదే
ప్రపంచ కప్ వన్డే చరిత్రలోనే ఇంగ్లండ్ మూడోసారి అత్యధిక స్కోరును నమోదు చేసింది. 2023 మెగా టోర్నీలో 7వ మ్యాచ్‌లో భాగంగా ఇవాళ బంగ్లాదేశ్‌తో ఇంగ్లండ్ ఢీకొట్టింది. ఈ మేరకు తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లీష్ జట్టు 364/9తో భారీ స్కోరు నమోదు చేసింది. మొదట ఇంగ్లండ్ టాప్ ఆర్డర్ బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించారు. జో రూట్, జానీ బెయిర్‌స్టో అర్ధ శతకాలు సాధించారు. స్టార్ ఓపెనర్ డేవిడ్ మలాన్ కెరీర్‌లోనే అత్యుత్తమంగా 140 పరుగులు బాదాడు. బెయిర్ స్టో 59 బంతుల్లో 52 పరుగులు చేశాడు. పెవీలియన్ బాట పట్టేముందు మలాన్ తో కలిసి 115 పరుగుల రికార్డ్ భాగస్వామ్యం నమోదు చేసింది.
ప్రపంచ కప్ టోర్నీల్లో దక్షిణాఫ్రికా టాప్ స్కోరర్
మరోవైపు బెయిర్‌స్టో ఔటయ్యాక రూట్ బంగ్లా బౌలర్లను బెంబెలెత్తించాడు. మలాన్‌తో కలిసి రెండో వికెట్‌కు 141 పరుగులు జోడించారు. 91 బంతుల్లో 100 పరుగులు చేసిన మలాన్, కేవలం 16 బంతుల్లోనే చివరి 40 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలోనే సెంచరీకి చేరువవుతున్న రూట్ 82 పరుగుల వద్ద నిష్క్రమించాడు. మాంచెస్టర్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 397/6 స్కోరు చేసింది. కార్డిఫ్‌లో బంగ్లాదేశ్‌పై 386/6 పరుగులతో రెండో అత్యధిక స్కోరును నమోదు చేసింది. తాజాగా ఇంగ్లాండ్ 364/9 పరుగులతో మూడోసారి ప్రపంచ కప్ ఈవెంట్లలో అత్యధిక స్కోరును ఒడిసిపట్టింది. 2023 ప్రపంచకప్ లో భాగంగా దక్షిణాఫ్రికా వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యధిక స్కోరు 428/5ని శ్రీలంకపై నమోదు చేసింది.