LOADING...
T20 WC 2026: ఓడినా రికార్డు సృష్టించిన ఇంగ్లండ్‌ స్టార్‌ ప్లేయర్
ఓడినా రికార్డు సృష్టించిన ఇంగ్లండ్‌ స్టార్‌ ప్లేయర్

T20 WC 2026: ఓడినా రికార్డు సృష్టించిన ఇంగ్లండ్‌ స్టార్‌ ప్లేయర్

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 06, 2026
11:55 am

ఈ వార్తాకథనం ఏంటి

టీ20 ప్రపంచకప్ 2026 రెండో సెమీఫైనల్లో నిన్న (మార్చి 5) భారత్‌ ఉత్కంఠభరిత విజయాన్ని నమోదు చేసింది. ఇంగ్లండ్‌పై కేవలం 7 పరుగుల తేడాతో గెలిచిన భారత్‌ వరుసగా రెండో ఎడిషన్‌లో, మొత్తం నాలుగోసారి ఫైనల్‌కు చేరుకుంది. అయితే నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఓడిపోయినా, వారి బ్యాటర్లు భారత శిబిరంలో గుబులు రేపారు. ముఖ్యంగా యువ బ్యాటర్‌ జేకబ్‌ బేతెల్‌ భారత బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు.

Details

బేతెల్‌ తుఫాన్ ఇన్నింగ్స్

254 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు బేతెల్‌ దూకుడు బ్యాటింగ్‌తో అండగా నిలిచాడు. తొలి బంతి నుంచే బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడిన అతను కేవలం 45 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి ఇంగ్లండ్‌ను గెలుపు వాకిటి వరకు తీసుకెళ్లాడు. అయితే సెంచరీ పూర్తయిన కొద్దిసేపటికే భారత్‌కు కీలక బ్రేక్‌ దొరికింది. ఆ సమయంలో ఇంగ్లండ్‌ గెలుపుకు 18 బంతుల్లో 45 పరుగులు అవసరం. ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌ వేసిన బుమ్రా కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి మ్యాచ్‌ను భారత్‌ వైపు మళ్లించాడు.

Details

కీలక సమయాల్లో బుమ్రా, హార్దిక్‌ బౌలింగ్

19వ ఓవర్‌ను హార్దిక్‌ పాండ్యా వేసి ప్రమాదకరంగా కనిపిస్తున్న సామ్‌ కర్రన్‌ను ఔట్‌ చేయడంతో పాటు ఆ ఓవర్‌లో 9 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో భారత్‌కు గెలుపుపై ధీమా పెరిగింది. చివరి ఓవర్‌ వేసిన శివమ్‌ దూబే తొలి బంతికే బేతెల్‌ను ఔట్‌ చేయడంతో భారత శిబిరం ఊపిరి పీల్చుకుంది. అనంతరం రెండు బంతులకు సింగిల్స్‌ మాత్రమే ఇచ్చిన దూబే... చివరి మూడు బంతులకు ఆర్చర్‌ సిక్సర్లు బాదినా అప్పటికే ఇంగ్లండ్‌ ఓటమి ఖరారైపోయింది.

Advertisement

Details

రికార్డు బద్దలు కొట్టిన బేతెల్

ఇంత భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌ బ్యాటర్లు, ముఖ్యంగా బేతెల్‌ ఎక్కడా వెనుకడుగు వేయలేదు. 95 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును అతను విల్‌ జాక్స్‌, సామ్‌ కర్రన్‌ల సహకారంతో గెలుపు దిశగా తీసుకెళ్లాడు. అయితే 18, 19 ఓవర్లలో బుమ్రా, హార్దిక్‌ కట్టడి చేయడంతో మ్యాచ్‌ భారత్‌ చేతిలోనే నిలిచింది. ఈ వీరోచిత శతకంతో బేతెల్‌ పలు అరుదైన రికార్డులు సొంతం చేసుకున్నాడు. టీ20 ప్రపంచకప్‌ నాకౌట్‌ మ్యాచ్‌ల్లో అత్యధిక స్కోర్‌ (105) చేసిన ఆటగాడిగా నిలిచి, నిన్ననే ఫిన్‌ అలెన్‌ చేసిన 100 పరుగుల రికార్డును బద్దలు కొట్టాడు. ఇదే బేతెల్‌కు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తొలి సెంచరీ కావడం విశేషం.

Advertisement

Details

తొలి ఆటగాడిగా బెతెల్ చరిత్ర

ప్రపంచంలో ఏ క్రికెటర్‌ తన తొలి ఫస్ట్‌క్లాస్‌, లిస్ట్‌-ఏ, టీ20 సెంచరీని అంతర్జాతీయ మ్యాచ్‌లో నమోదు చేయలేదు. ఈ అరుదైన ఘనత సాధించిన తొలి ఆటగాడిగా బేతెల్‌ చరిత్ర సృష్టించాడు. ప్రపంచకప్‌ టోర్నీల్లో ఇంగ్లండ్‌ తరఫున సెంచరీలు చేసిన బ్యాటర్లలో బేతెల్‌ నాలుగో ఆటగాడు. వీరిలో రెండో అత్యధిక స్కోర్‌ కూడా అతనిదే. కాగా ఇంగ్లండ్‌ తరఫున టీ20 ప్రపంచకప్‌ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ రికార్డు అలెక్స్‌ హేల్స్‌ (116 నాటౌట్‌) పేరిట ఉంది.

Details

భారత్‌ భారీ స్కోర్

అంతకుముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. స్టార్‌ బ్యాటర్‌ సంజూ శాంసన్‌ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ అద్భుతంగా ఆడి 89 పరుగులు చేసి జట్టుకు బలమైన పునాది వేశాడు. భారత ఇన్నింగ్స్‌లో ఇషాన్‌ కిషన్‌ (39), శివమ్‌ దూబే (43), హార్దిక్‌ పాండ్యా (27), తిలక్‌ వర్మ (21) కూడా మెరుపు ఇన్నింగ్స్‌లతో జట్టుకు సహకరించారు. ఈ విజయంతో భారత్‌ ఫైనల్‌కు చేరగా, మార్చి 8న న్యూజిలాండ్‌తో తలపడనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఈ తుది పోరుకు వేదిక కానుంది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మ్యాచ్‌లో కప్పు కోసం ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి.

Advertisement