Page Loader
MS Dhoni: వీల్‌ఛైర్‌లో ఉన్నా సీఎస్కే నన్ను లాక్కెళ్తుంది.. రిటైర్మెంట్‌పై ధోనీ స్పష్టత
వీల్‌ఛైర్‌లో ఉన్నా సీఎస్కే నన్ను లాక్కెళ్తుంది.. రిటైర్మెంట్‌పై ధోనీ స్పష్టత

MS Dhoni: వీల్‌ఛైర్‌లో ఉన్నా సీఎస్కే నన్ను లాక్కెళ్తుంది.. రిటైర్మెంట్‌పై ధోనీ స్పష్టత

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 23, 2025
12:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని (MS Dhoni) ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతాడనే వార్తలు మళ్లీ ఊపందుకున్నాయి. గత సీజన్‌లోనూ ఇలాంటి పుకార్లు షికార్లు చేసినా, ధోనీ 18వ సీజన్‌కి సిద్ధమయ్యాడు. అయితే ఈ ఎడిషన్ ముగిసిన తర్వాత అతడు ఆటకు గుడ్‌బై చెబుతాడని మళ్లీ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ధోనీ రిటైర్మెంట్‌పై వచ్చే వార్తలను కొట్టిపడేశాడు. తాజాగా ముంబయి ఇండియన్స్‌ (CSK vs MI) మ్యాచ్ సందర్భంగా ధోనీ స్వయంగా స్పందించాడు. తన రిటైర్మెంట్‌పై వస్తున్న పుకార్లను ఖండించారు. వీల్‌ఛైర్‌లో ఉన్నా సరే సీఎస్కే నన్ను లాక్కెళ్లిపోతుంది. ఎంతకాలం ఆడాలనుకుంటే అంతకాలం ఆడతానని ధోనీ వ్యాఖ్యానించాడు.

Details

 గాయాలతో పోరాటం 

చెన్నై సూపర్ కింగ్స్‌ తరుపున ఇంకా చాలా కాలం ఆడాలని అనుకుంటున్నానని స్పష్టం చేశాడు. 2023 ఐపీఎల్‌లో మోకాలి గాయంతో ధోనీ ఇబ్బందిపడ్డాడు. సీజన్ ముగిసిన వెంటనే శస్త్రచికిత్స చేయించుకున్నాడు. గతేడాది ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగి సిక్సర్లతో మెరుపులు మెరిపించాడు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేసిన ధోనీ, ఈసారి పూర్తిగా ఫిట్‌గా కనిపిస్తున్నాడు. మైదానంలో మ్యాచ్ మొత్తాన్ని ఆడే అవకాశముందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బ్యాటింగ్ ఆర్డర్‌లోనూ ముందుకు వస్తాడని అంచనా.

Details

ధోనీతో మాట్లాడటం సులభమే: సామ్ కరన్ 

ఇక ఆల్‌రౌండర్ సామ్ కరన్ ధోనీతో తన అనుభవాన్ని పంచుకున్నాడు. ధోనీతో వ్యక్తిగతంగా చాటింగ్ చేయడం చాలా తేలిక అని, జట్టులో చాలా మంది లోకల్ ప్లేయర్లు అతడి చుట్టూ కూర్చొని ముచ్చటించడం అద్భుతంగా ఉంటుందన్నారు. ధోనీ ఎప్పుడూ కంగారు పడడని, నిశ్శబ్దంగా ఉంటూ భావోద్వేగాలను బయటపడకుండా ముందుకు సాగిపోతాడని కొనియాడారు.