Page Loader
RCB vs MI: ఆఖరి వరకూ ఆర్సీబీ పోరాడినా.. చివరికి ముంబైదే విజయం
ఆఖరి వరకూ ఆర్సీబీ పోరాడినా.. చివరికి ముంబైదే విజయం

RCB vs MI: ఆఖరి వరకూ ఆర్సీబీ పోరాడినా.. చివరికి ముంబైదే విజయం

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 22, 2025
09:10 am

ఈ వార్తాకథనం ఏంటి

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయాల పరంపరకు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్‌లో బ్రేక్ పడింది. వరుసగా రెండు విజయాల తర్వాత శనివారం ముంబయి ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో ఆర్సీబీ తొలి ఓటమిని ఎదుర్కొంది. చివరి బంతికి ముందే ముంబై 4 వికెట్ల తేడాతో లక్ష్యాన్ని చేధించి గెలుపును ఖరారు చేసింది. ఈ మ్యాచ్‌లో ముఖ్యంగా 19వ ఓవర్‌ను కనిక అహుజా విపరీతంగా ఇచ్చిన పరుగులు ఆర్సీబీ ఓటమికి కారణమయ్యాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూర్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఎల్లిస్ పెర్రీ (81 పరుగులు, 43 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుత హాఫ్ సెంచరీతో ఆకట్టుకుంది.

Details

అమన్‌జోత్ కౌర్ అల్ రౌండర్ ప్రదర్శన

రిచా ఘోష్ (28 పరుగులు, 25 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ స్మృతి మంధాన (26 పరుగులు, 13 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) మెరుగైన ఆరంభాన్ని అందించినా, చివర్లో భారీ స్కోరు చేయడంలో జట్టు విఫలమైంది. ముంబై బౌలర్లలో అమన్‌జోత్ కౌర్ (3/22) అద్భుత ప్రదర్శనతో మూడు కీలక వికెట్లు పడగొట్టగా, షబ్నిమ్ ఇస్మైల్, నాట్ సీవర్ బ్రంట్, హీలీ మాథ్యూస్, సాంస్క్రిత్ గుప్తా తలో వికెట్ తీసి ఆర్సీబీ స్కోరును కట్టడి చేశారు. 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 19.5 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసి విజయం సాధించింది.

Details

హాఫ్ సెంచరీతో రాణించిన హర్మన్‌ప్రీత్ కౌర్

కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (50 పరుగులు, 38 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీతో చెలరేగగా, నాట్ సీవర్ బ్రంట్ (42 పరుగులు, 21 బంతుల్లో 9 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. అంతేకాకుండా, చివర్లో అమన్‌జోత్ కౌర్ (34 నాటౌట్, 27 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులు) కీలకంగా రాణించింది. ఆర్సీబీ బౌలర్లలో జార్జియా వేర్‌హామ్ (3/21) మూడు వికెట్లు తీయగా, కిమ్ గార్త్ (2/30) రెండు వికెట్లు తీసింది. అయితే ముంబై విజయానికి చివరి 2 ఓవర్లలో 22 పరుగులు అవసరమైన నేపథ్యంలో మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది.

Details

చివర్లో భారీగా పరుగులిచ్చిన కనిక అహుజా

ఆర్‌సీబీ విజయం సాధిస్తుందని అభిమానులు భావించినా, 19వ ఓవర్లో కనిక అహుజా భారీగా పరుగులు ఇచ్చింది. అమన్‌జోత్ కౌర్ తొలి బంతిని, చివరి బంతిని సిక్సర్‌గా మలిచింది, దీంతో ఆ ఓవర్లో 16 పరుగులు వచ్చాయి. ఆఖరి ఓవర్‌లో ముంబైకి 6 పరుగులు అవసరమయ్యాయి. ఆర్సీబీ బౌలర్ ఎక్తా బిస్త్ తొలి నాలుగు బంతుల్లో కేవలం 4 పరుగులు ఇచ్చినా, ఐదో బంతిని కమలి బౌండరీ కొట్టి ముంబై గెలుపును ఖరారు చేసింది.