Dinesh Karthik: వారెవ్వా.. చెన్నైలో కార్తీక్ కోసం విద్యార్థులు ఏం చేశారో తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
భారత మాజీ క్రికెటర్‌గా, తమిళనాడుకు చెందిన దినేశ్ కార్తీక్‌పై తమ అభిమానాన్ని చెన్నైస్ అమృత విద్యాసంస్థల విద్యార్థులు ప్రత్యేకంగా వ్యక్తం చేశారు. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన వార్షిక క్రీడోత్సవంలో భాగంగా, కార్తీక్ జెర్సీ సంఖ్య 19ను ప్రతిబింబించే విధంగా భారీ మానవహారం ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన అమృత విద్యాసంస్థల నుంచి సుమారు మూడు వేల మందికిపైగా విద్యార్థులు పాల్గొన్నారు. వారు అందరూ కలిసి 'డీకే19' రూపంలో మానవహారాన్ని రూపొందించి అందరినీ ఆకట్టుకున్నారు.
వివరాలు
ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం..
ఒక క్రీడాకారుడి జెర్సీని సూచించే మానవహారంలో అత్యధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్న కార్యక్రమంగా ఇది గుర్తింపు పొందింది. ఈ వినూత్న ప్రయత్నానికి 'ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్', 'ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్'లో స్థానం దక్కింది. చెన్నైస్ అమృత గ్రూప్ చైర్మన్ ఆర్. భూమినాథన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా క్రికెటర్ దినేశ్ కార్తీక్ హాజరయ్యారు. గౌరవ అతిథిగా తమిళనాడు డాక్టర్ ఎం.జి.ఆర్ మెడికల్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ కె. నారాయణ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన పనికి కార్తీక్ ఆనందం వ్యక్తం చేశాడు.