FIFA World Cup 2026 : ఫుట్‌బాల్‌లో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న మొరాకో.. భారత్‌కు అందులోని కీలక పాఠాలు
ఈ వార్తాకథనం ఏంటి
అంతర్జాతీయ ఫుట్ బాల్‌లో మొరాకో ఇటీవల చూపిస్తున్న ప్రగతి క్రీడా చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ప్రస్తుతం జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ 2026లో భాగంగా జూన్ 13న ఈస్ట్ రూథర్‌ఫర్డ్‌లో జరిగిన గ్రూప్-సి పోరులో మొరాకో జట్టు ఫుట్‌బాల్ దిగ్గజం బ్రెజిల్‌ను 1-1తో డ్రా చేయడం ద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఈ మ్యాచ్‌లో మొరాకో తరఫున ఇస్మాయిల్ సాయిబారి తొలి గోల్ నమోదు చేసి జట్టుకు ఆధిక్యం అందించగా, అనంతరం బ్రెజిల్ స్టార్ వినీషియస్ జూనియర్ తన ప్రతిభతో సమం చేసే గోల్ సాధించి జట్టును ఓటమి నుంచి తప్పించాడు.
వివరాలు
బలమైన జట్లను ఓడించి..
2022 వరల్డ్ కప్‌లో బెల్జియం, స్పెయిన్, పోర్చుగల్ వంటి బలమైన జట్లను ఓడించి సెమీఫైనల్‌కు చేరిన మొరాకోకు, బ్రెజిల్ వంటి అగ్రశ్రేణి జట్టును నిలువరించడం ఆశ్చర్యకరమైన విషయం కాదు. ఒకప్పుడు అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో పెద్దగా ప్రభావం చూపని మొరాకో, నేడు ప్రపంచస్థాయి జట్టుగా ఎదగడం వెనుక సుదీర్ఘ ప్రణాళిక మరియు కచ్చితమైన అమలు ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం మొరాకో ఫుట్‌బాల్ ఫెడరేషన్ దేశవ్యాప్తంగా ఫుట్‌బాల్ అభివృద్ధి కోసం విస్తృత స్థాయి సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆధునిక స్టేడియాల నిర్మాణం, విదేశీ నిపుణుల సహకారంతో ఆధునిక కోచింగ్ విధానాల అమలు వంటి చర్యలను చేపట్టింది. ఈ మార్పుల ఫలితంగానే మొరాకో ప్రపంచ ఫుట్‌బాల్‌లో శక్తివంతమైన జట్టుగా అవతరించింది.
వివరాలు
విజయానికి కారణం ఆ అకాడమీనే..
ఈ విజయగాథలో అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించిన సంస్థ మొహమ్మద్ VI ఫుట్‌బాల్ అకాడమీ. దేశంలో ప్రతిభను చిన్న వయసు నుంచే గుర్తించి తీర్చిదిద్దాలనే లక్ష్యంతో 2009లో కింగ్ మొహమ్మద్ VI ఈ అకాడమీని ప్రారంభించారు. ఇక్కడ కేవలం ఫుట్‌బాల్ శిక్షణ మాత్రమే కాకుండా, విద్య, స్పోర్ట్స్ సైన్స్, ఆధునిక వైద్య సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. 2022 వరల్డ్ కప్ సెమీఫైనల్ చేరిన జట్టులోని ఎక్కువ మంది ఆటగాళ్లు ఇక్కడే శిక్షణ పొందారు. 2025లో చిలీలో జరిగిన అండర్-20 వరల్డ్ కప్ విజయంలో కూడా ఈ అకాడమీకి చెందిన యువ క్రీడాకారులు కీలక పాత్ర పోషించారు.
వివరాలు
మొరాకో విజయా వెనుక ఆ వ్యూహం..
మొరాకో విజయాల వెనుక మరో తెలివైన వ్యూహం కూడా ఉంది. యూరప్‌లో స్థిరపడిన మొరాకో మూలాలున్న ప్రతిభావంతులైన ఫుట్‌బాల్ క్రీడాకారులను గుర్తించి, జాతీయ జట్టు తరఫున ఆడేందుకు ప్రోత్సహించింది. ప్రపంచంలో అగ్రశ్రేణి రైట్-బ్యాక్‌లలో ఒకరిగా గుర్తింపు పొందిన అచ్రాఫ్ హకీమి, అలాగే హకీమ్ జియెచ్, నౌసైర్ మజ్రౌయి వంటి ఆటగాళ్లు స్పెయిన్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్ వంటి దేశాల్లో తమ కెరీర్‌ను ప్రారంభించినప్పటికీ, చివరకు మొరాకో జట్టుకు ప్రాతినిధ్యం వహించడాన్ని ఎంచుకున్నారు. దీనివల్ల మొరాకోకు అత్యున్నత స్థాయి అంతర్జాతీయ అనుభవం లభించింది.
వివరాలు
ఆ జట్టుపై భారీగా పెట్టుబడులు..
జట్టు అభివృద్ధిలో ప్రధాన కోచ్ వాలిద్ రెగ్రాగుయ్ పాత్ర కూడా విశేషమైనది. ఆయన నాయకత్వంలో ఆటగాళ్లలో క్రమశిక్షణ, వ్యూహాత్మక ఆలోచన, జట్టు కోసం త్యాగం చేసే మనస్తత్వం పెరిగింది. మొరాకోలో ఫుట్‌బాల్‌కు సామాజికంగా ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆఫ్రికాలోనే అత్యంత ఉత్సాహభరితమైన అభిమాన సంస్కృతి అక్కడ కనిపిస్తుంది. వైదాద్ ఏసీ, రాజా సీఏ వంటి ప్రముఖ క్లబ్‌ల మ్యాచ్‌లకు వేలాది మంది అభిమానులు హాజరవుతుంటారు. ఈ వాతావరణం చిన్నారుల్లోనే ఫుట్‌బాల్‌పై ఆసక్తిని పెంచి, భవిష్యత్ స్టార్‌లుగా ఎదగాలనే కలలను రేకెత్తిస్తోంది. 2030 ఫిఫా వరల్డ్ కప్‌ను స్పెయిన్, పోర్చుగల్‌తో కలిసి నిర్వహించనున్న మొరాకో, క్రీడా మౌలిక సదుపాయాలపై మరింత భారీగా పెట్టుబడులు పెట్టుతోంది.