Fifa World cup: క్వార్టర్‌ఫైనల్లో నేడు స్పెయిన్-బెల్జియం హోరాహోరీ పోరు
ఈ వార్తాకథనం ఏంటి
ఫిఫా ప్రపంచకప్‌లో క్వార్టర్‌ఫైనల్ దశ మరింత ఉత్కంఠభరితంగా మారింది. శుక్రవారం జరిగే కీలక పోరులో స్పెయిన్, బెల్జియం జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో స్పెయిన్ మూడో స్థానంలో ఉండగా, బెల్జియం ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. కాగితాలపై స్పెయిన్‌కు స్వల్ప ఆధిక్యం కనిపిస్తున్నప్పటికీ, బెల్జియాన్ని తేలికగా తీసుకునే పరిస్థితి లేదు. గ్రూప్ దశలో కేప్ వెర్డేతో గోల్స్ లేకుండా డ్రా అయిన స్పెయిన్, అనంతరం సౌదీ అరేబియాపై 4-0తో, ఉరుగ్వేపై 1-0తో విజయాలు నమోదు చేసి గ్రూప్-జి అగ్రస్థానంలో నిలిచింది. అనంతరం 32 జట్ల నాకౌట్ దశలో ఆస్ట్రియాపై 3-0తో ఏకపక్ష విజయాన్ని సాధించింది.
వివరాలు
అగ్రస్థానంలో ఆ జట్టు..
ప్రిక్వార్టర్‌ఫైనల్లో పోర్చుగల్‌ను 1-0తో మట్టికరిపించిన స్పెయిన్ పూర్తి ఆత్మవిశ్వాసంతో క్వార్టర్‌ఫైనల్‌కు సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లు యమాల్, రోడ్రి ప్రదర్శన జట్టు విజయావకాశాలను ప్రభావితం చేయనుంది. మరోవైపు బెల్జియం కూడా కఠినమైన ప్రయాణం తర్వాత చివరి ఎనిమిది జట్లలో స్థానం దక్కించుకుంది. టోర్నీ ఆరంభంలో ఆశించిన స్థాయిలో రాణించకపోయినా, క్రమంగా పుంజుకుని అత్యంత ప్రమాదకర జట్లలో ఒకటిగా ఎదిగింది. గ్రూప్ దశలో ఈజిప్ట్, ఇరాన్‌లతో డ్రాగా ముగించిన బెల్జియం, న్యూజిలాండ్‌పై 5-1 తేడాతో ఘన విజయం సాధించి గ్రూప్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.
వివరాలు
స్పెయిన్ కంటే మరింత దూకుడుగా బెల్జియం..
32 జట్ల నాకౌట్ దశలో సెనెగల్‌తో జరిగిన మ్యాచ్‌లో బెల్జియం అసాధారణ పోరాట పటిమను కనబర్చింది. 86వ నిమిషం వరకు 0-2తో వెనుకబడిన ఆ జట్టు ఓటమి ఖాయమని అందరూ భావించిన సమయంలో చివరి క్షణాల్లో అద్భుతంగా పుంజుకుని విజయాన్ని అందుకుంది. అదే జోరును కొనసాగిస్తూ ప్రిక్వార్టర్‌లో అమెరికాపై 4-1తో ఘన విజయం సాధించి క్వార్టర్‌ఫైనల్‌కు అర్హత సాధించింది. ఇప్పుడు స్పెయిన్‌పైనా అదే దూకుడును కొనసాగించాలని బెల్జియం లక్ష్యంగా పెట్టుకుంది. డి బ్రూయిన్, కూర్‌త్వా ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశముంది. ముఖ్యంగా దాడి విభాగంలో బెల్జియం స్పెయిన్‌కంటే మరింత పదునుగా కనిపిస్తోంది.
వివరాలు
రెండు జట్ల మధ్య రసవత్తర పోరు..
ప్రపంచకప్ చరిత్రలో స్పెయిన్, బెల్జియం ఇప్పటివరకు రెండుసార్లు తలపడ్డాయి. ఈ రెండు మ్యాచ్‌ల్లో చెరో జట్టు ఒక్కోసారి విజయం సాధించింది. 1986 ప్రపంచకప్ క్వార్టర్‌ఫైనల్లో బెల్జియం పెనాల్టీ షూటౌట్‌లో 5-4తో స్పెయిన్‌ను ఓడించింది. అనంతరం జరిగిన ప్రపంచకప్‌లో గ్రూప్ దశలో మళ్లీ ఎదురెదురైన ఈ జట్ల పోరులో స్పెయిన్ 2-1తో పైచేయి సాధించింది. ఇక అన్ని టోర్నీలను కలుపుకుని స్పెయిన్, బెల్జియం ఇప్పటివరకు 22 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. వాటిలో స్పెయిన్ 12 విజయాలు నమోదు చేయగా, బెల్జియం 5 మ్యాచ్‌ల్లో గెలిచింది. మిగిలిన 5 పోటీలు డ్రాగా ముగిశాయి.