
ENG vs IND: తొలి గంటలోనే మ్యాచ్‌ను ఫినిష్ చేయండి : ఇంగ్లడ్ సహాయక కోచ్
ఈ వార్తాకథనం ఏంటి
లార్డ్స్ టెస్టు మాంచి ఉత్కంఠభరిత దశలోకి చేరుకుంది. విజయం ఎవరిది అన్న ప్రశ్నకు సమాధానం చివరి రోజు మాత్రమే ఇస్తుంది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 58/4తో కష్టాల్లో ఉంది. క్రీజ్‌లో కేఎల్ రాహుల్ (33*)నిలకడగా ఉన్నాడు. భారత్‌కు ఇంకా 135 పరుగులు అవసరం. బ్యాటింగ్‌కు రిషభ్ పంత్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ ఇంకా మిగిలి ఉన్నారు. చివర్లో బుమ్రా, సిరాజ్ ఓవర్‌లు తీయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ఇంగ్లండ్ సహాయక కోచ్ మార్కస్ ట్రెస్కోథిక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "పిచ్ నుంచి బౌన్స్ బాగానే వస్తోంది. పెవిలియన్ ఎండ్‌తో పోలిస్తే నర్సరీ ఎండ్ నుంచి బౌలర్లకు మరింత సహాయం అందుతోంది.
Details
త్వరగా వికెట్లు తీయాలి
స్లోప్‌ను ఉపయోగిస్తూ స్టంప్స్ లక్ష్యంగా బంతులేయాలని మా బౌలర్లకు సూచించాం. ఐదో రోజు ఉదయం పరిస్థితులు మారవని భావిస్తున్నాం. తొలి గంటలోనే ఆరు వికెట్లు తీసే లక్ష్యాన్ని మా బౌలర్ల ముందుంచాం. నాలుగో రోజు చివర్లో రెండు కీలక వికెట్లు తీయడంతో బౌలర్ల ఆత్మవిశ్వాసం పెరిగింది. ఈ రోజు ఉదయం భారత్ బ్యాటర్లు ఎలా ఆడతారు, మా బౌలర్లు ఎలా రియాక్ట్ అవుతారు అన్నదే మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించనుంది. త్వరగా వికెట్లు తీయగలిగితే మ్యాచ్‌పై పట్టు సాధించగలమని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు బౌలర్ బషీర్ ఫిట్‌నెస్ గురించి కూడా ట్రెస్కోథిక్ అప్‌డేట్ ఇచ్చాడు.
Details
బషీర్ ఫిట్ గా ఉన్నాడు
మూడో రోజు బౌలింగ్ చేస్తున్న సమయంలో జడేజా కొట్టిన బంతి బషీర్ చేతికి బలంగా తగలగా, అతడు మైదానం విడిచిపోయాడు. అయితే నాలుగో రోజు చివర్లో బ్యాటింగ్‌కు వచ్చాడు. ఐదో రోజు స్పిన్నర్ పాత్ర కీలకమవుతుందనే దృష్ట్యా బషీర్ స్థితిపై స్పష్టత ఇచ్చారు ట్రెస్కోథిక్. బషీర్ బౌలింగ్ చేసేందుకు ఫిట్‌గా ఉన్నాడు. అవసరమయ్యే సమయంలో అతడు బౌలింగ్ చేస్తాడు. ఒకవేళ అలా సాధ్యపడకపోతే మాత్రం మాకు కాస్త ఇబ్బందే. కానీ ప్రస్తుతం అతడు సిద్ధంగానే ఉన్నాడని చెప్పారు.