
Park Hyatt Fire Accident : సన్‌రైజర్స్ టీమ్ బస చేసిన హోటల్‌లో మంటలు.. తప్పిన పెను ప్రమాదం!
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
ఈ ప్రమాదం సమయంలో అదే హోటల్‌లో హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టు సభ్యులు బస చేయడం, అభిమానుల్లో ఆందోళనకు దారి తీసింది. హోటల్ మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
దీంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. అయితే ప్రమాద సమయంలో ఎస్‌ఆర్‌హెచ్ ఆటగాళ్లు ఆరో అంతస్తులో ఉన్నారు.
అప్రమత్తమైన హోటల్ సిబ్బంది వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించగా, ఫైర్ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
ప్రమాదానికి కారణంగా విద్యుత్ వైరింగ్‌లో తలెత్తిన సమస్యే కారణమని అగ్నిమాపక సిబ్బంది వెల్లడించారు
Details
ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు
అటు ప్లేయర్లు, సహాయక సిబ్బందిని హుటాహుటిన బస్సుల్లో భద్రంగా తరలించారని హోటల్ సిబ్బంది తెలిపారు.
ఎస్‌ఆర్‌హెచ్ టీమ్ సభ్యులెవరూ గాయపడలేదని, వారంతా సురక్షితంగా హోటల్‌ను వీడినట్టు స్పష్టం చేశారు.
ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
హైదరాబాద్ జిల్లా అగ్నిమాపక అధికారి (DFO) తెలిపిన వివరాల ప్రకారం, ఎస్‌ఆర్‌హెచ్ టీమ్ తమ షెడ్యూల్ ప్రకారం హోటల్ నుంచి సురక్షితంగా చెక్ అవుట్ చేసిందని తెలిపారు.
ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని స్పష్టంగా చెప్పారు.
Details
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అగ్నిమాపక వారోత్సవాలు
అదే సమయంలో ఏప్రిల్ 14 నుంచి 20వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అగ్నిమాపక వారోత్సవాలు జరగనున్నాయి.
హైదరాబాద్‌లోని వట్టినాగులపల్లి ఫైర్ ట్రైనింగ్ సెంటర్‌లో ఈ వారోత్సవాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ నాగిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అక్కడ అమరవీరుల స్మారక స్థూపానికి ఆయన నివాళులర్పించారు.
వారోత్సవాల సందర్భంగా ప్రజల్లో అగ్నిప్రమాదాలపై అవగాహన పెంచేందుకు శిక్షణ కార్యక్రమాలు, అవగాహన సదస్సులు, ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
అగ్నిమాపక సిబ్బందికి ప్రేరణను కలిగించడంతోపాటు ప్రజల భద్రతకు అవగాహన కల్పించడమే ఈ వారోత్సవాల ఉద్దేశమని ఆయన వివరించారు.