5 Wickets in an Over: ఒకే ఓవర్‌లో ఐదు వికెట్లు.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు!
ఈ వార్తాకథనం ఏంటి
ఇండోనేషియా బౌలర్ గ్రెడే ప్రియాందన అంతర్జాతీయ క్రికెట్‌లో సంచలనం సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఒకే ఓవర్‌లో ఐదు వికెట్లు తీసిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. కంబోడియాతో జరిగిన మ్యాచ్‌లో తాను వేసిన మొదటి ఓవర్‌లోనే ఈ అరుదైన ఘనత సాధించడం విశేషంగా నిలిచింది. బాలి వేదికగా మంగళవారం జరిగిన ఇండోనేషియా-కంబోడియా తొలి టీ20 మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండోనేషియా 168 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్య ఛేదనలో కంబోడియా జట్టు 15 ఓవర్లకు 106/5తో పోరాటంలో నిలిచింది. ఈ దశలో 16వ ఓవర్‌ను కుడిచేతి వాటం బౌలర్ ప్రియాందనకు అప్పగించింది ఇండోనేషియా. అదే ఈ మ్యాచ్‌లో అతడి తొలి ఓవర్. కానీ ఆ ఓవర్ మ్యాచ్ గమనాన్నే మార్చేసింది.
Details
తొలి మూడు బంతుల్లో హ్యాట్రిక్
మెరుపులాంటి బంతులతో కంబోడియా బ్యాటర్లను వణికించిన ప్రియాందన తొలి మూడు బంతుల్లో ముగ్గురిని ఔట్ చేసి హ్యాట్రిక్ నమోదు చేశాడు. నాలుగో బంతిని డాట్‌బాల్‌గా మార్చిన అతడు, ఆపై మిగిలిన రెండు బంతుల్లో మరో ఇద్దరిని పెవిలియన్‌కు పంపించాడు. ఈ ఓవర్‌లో చివరి రెండు వికెట్ల మధ్య కంబోడియాకు వైడ్ రూపంలో ఒక పరుగు మాత్రమే దక్కింది. దీంతో కంబోడియా జట్టు 107 పరుగులకే ఆలౌట్ అయి, ఇండోనేషియాతో 60 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అదే మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో ప్రియాందన 11 బంతుల్లో 6 పరుగులు మాత్రమే చేశాడు. కానీ బౌలింగ్‌లో మాత్రం అసాధ్యమనుకున్న రికార్డును సాధించి క్రికెట్ చరిత్రలో తన పేరును లిఖించుకున్నాడు.
Details
గతంలో దేశవాలీ క్రికెట్ లో రెండుసార్లు నమోదు
ఇంతకుముందు ఒకే ఓవర్‌లో ఐదు వికెట్లు తీసిన ఘనత దేశవాళీ టీ20ల్లో మాత్రమే రెండుసార్లు నమోదైంది. 2013-14 విక్టరీడే టీ20 కప్‌లో బంగ్లాదేశ్ ఆటగాడు అల్ అమీన్ హొస్సేన్, 2019-20 సయ్యద్ ముస్తాఖ్ అలీ ట్రోఫీ సెమీఫైనల్‌లో కర్ణాటక బౌలర్ అభిమన్యు మిథున్ ఈ ఫీట్‌ను సాధించారు. అయితే అంతర్జాతీయ టీ20ల్లో మాత్రం ఇది తొలి సారి కావడం ప్రియాందన రికార్డుకు మరింత ప్రాధాన్యతను తీసుకొచ్చింది. ఇప్పటివరకు అంతర్జాతీయ టీ20ల్లో ఒకే ఓవర్‌లో నాలుగు వికెట్లు తీసిన సందర్భాలు 14 సార్లు నమోదయ్యాయి.