LOADING...
Team india: విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, అశ్విన్ లేకుండా 15 ఏళ్ల తర్వాత టీమ్‌ఇండియా స్వదేశంలో టెస్ట్‌ మ్యాచ్

Team india: విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, అశ్విన్ లేకుండా 15 ఏళ్ల తర్వాత టీమ్‌ఇండియా స్వదేశంలో టెస్ట్‌ మ్యాచ్

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 02, 2025
01:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, రవిచంద్రన్‌ అశ్విన్ వంటి ఈ ముగ్గురు స్టార్‌ ప్లేయర్లు లేకుండా దాదాపు 15 ఏళ్ల తర్వాత టీమ్‌ఇండియా (Team India) తొలిసారిగా స్వదేశంలో టెస్ట్‌ మ్యాచ్‌ ఆడుతోంది ఇంతకుముందు 5,430 రోజుల క్రితం.. 2011లో ఈ ముగ్గురూ లేకుండా టీమ్‌ఇండియా స్వదేశంలో టెస్ట్‌ మ్యాచ్‌ ఆడింది. తాజాగా ఆసియా కప్‌ (Asia Cup) 2025 గెలిచి జోష్‌ మీదున్న భారత జట్టు 4 రోజుల వ్యవధిలోనే వెస్టిండీస్‌తో టెస్ట్‌ సిరీస్‌ ఆడుతోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో నేటినుంచి (గురువారం) ఇండియా - వెస్టిండీస్‌ల మధ్య తొలి టెస్టు జరుగుతోంది.

వివరాలు 

ముగ్గురు దిగ్గజాలు లేకుండా ఆట 

15 సంవత్సరాల తరువాత కోహ్లీ, రోహిత్‌, అశ్విన్ లేకుండా భారత జట్టు స్వదేశంలో టెస్ట్‌ క్రికెట్ ఆడుతోంది. 2011లో రవిచంద్రన్ అశ్విన్ తన అంతర్జాతీయ టెస్ట్‌ కెరీర్‌ను ప్రారంభించి 2025 వరకూ ఏకకాలంలో 65 స్వదేశీ టెస్టుల్లో పాల్గొన్నాడు. అశ్విన్ చివరి 15 ఏళ్లలో ఎప్పుడూ ఈ ఫార్మాట్‌ నుంచి బయటకు రాలేదు.కొంతకాలం క్రితం ఆస్ట్రేలియా టూర్ మధ్యలో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు అతడు ప్రకటించాడు. ఇలాగే, ఇంగ్లాండ్ టూర్‌కు ముందు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ కూడా తమ టెస్ట్‌ కెరీర్‌కు ముగింపు చెప్పారు. 2011లో విరాట్ కోహ్లీ సుదీర్ఘ ఫార్మాట్లో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత రెండేళ్లకు 2013లో రోహిత్ శర్మ టెస్టుల్లోకి వచ్చాడు.

వివరాలు 

చివరిసారిగా న్యూజిలాండ్‌తో.. 

ప్రస్తుతం టీమ్‌ఇండియా ఈ ముగ్గురూ లేకుండా.. 5,430 రోజుల తర్వాత స్వదేశంలో తొలి టెస్టు ఆడుతోంది ఈ ముగ్గురు దిగ్గజ క్రికెటర్లు లేకుండా.. చివరిగా 2010 నవంబర్ 20న నాగ్‌పుర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టులో భారత జట్టు బరిలో దిగింది. ఆ మ్యాచ్‌లో గౌతమ్‌ గంభీర్‌, ఇషాంత్‌ శర్మ వంటి ఆటగాళ్లు పాల్గొన్నారు. గౌతమ్‌ గంభీర్‌ ప్రస్తుతం భారత జట్టు హెడ్‌ కోచ్‌గా ఉండగా, ఇషాంత్‌ శర్మ మాత్రమే ఇంకా అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్ కాలేదు. ప్రజ్ఞాన్ ఓజా బీసీసీఐ(BCCI) సెలెక్టర్లలో ఒకరిగా ఉన్నాడు.

వివరాలు 

అత్యధిక వికెట్ల వీరుడిగా.. 

రవిచంద్రన్‌ అశ్విన్ స్వదేశంలో ఆడిన 65 టెస్టుల్లో 47 విజయాలు భారత జట్టు కోసం సాదించారు. 9 మ్యాచ్‌లలో ఓటమి,మరో 9 మ్యాచ్‌లను డ్రా చేయడం ద్వారా అశ్విన్‌ జట్టు విజయానికి కీలక పాత్ర పోషించారు. ఈ 65 టెస్టుల్లో 383 వికెట్లు తీసిన అశ్విన్‌ భారత్‌లో అత్యధిక వికెట్లు పొందిన బౌలర్‌గా ఉన్నారు. ఈ రికార్డును అనిల్‌ కుంబ్లే సాధించిన 350 వికెట్ల కంటే ముందుగా అధిగమించారు. అయితే రోహిత్‌ శర్మ కెప్టెన్సీలోని స్వదేశీ న్యూజిలాండ్‌ సిరీస్‌లో 3-0 తేడాతో భారత జట్టు ఘోరపరాభవాన్ని ఎదుర్కుంది. ఆ తర్వాత బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో కూడా భారత్‌ ఓటమి పాలైంది. ఈ పరిణామాలు రోహిత్‌, విరాట్‌ కోహ్లీ టెస్ట్‌ కెరీర్ల ముగింపుకు దారితీశాయి.

వివరాలు 

కొసమెరుపు 

విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్, రోహిత్ శర్మ.. ఈ ముగ్గురూ స్వదేశంలో తొలి టెస్టు వెస్టిండీస్‌ పైనే ఆడారు. 15 ఏళ్ల తర్వాత స్వదేశంలో ఈ ముగ్గురూ లేకుండా తొలి టెస్టు కూడా వెస్టిండీస్‌తోనే జరుగుతుండడం విశేషం.