Page Loader
Syed Abid Ali : భారత మాజీ క్రికెటర్ సయ్యద్ అబిద్ అలీ కన్నుమూత 
భారత మాజీ క్రికెటర్ సయ్యద్ అబిద్ అలీ కన్నుమూత

Syed Abid Ali : భారత మాజీ క్రికెటర్ సయ్యద్ అబిద్ అలీ కన్నుమూత 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 12, 2025
06:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత మాజీ క్రికెటర్‌ సయ్యద్‌ అబిద్‌ అలీ (83) బుధవారం మృతిచెందారు. హైదరాబాద్‌కు చెందిన అబిద్‌ అలీ అమెరికాలో తుదిశ్వాస విడిచారు. 1971లో ఓవల్‌లో జరిగిన చారిత్రాత్మక టెస్ట్‌ మ్యాచ్‌లో విజయం సాధించిన భారత జట్టులో కీలక సభ్యుడు. ఆల్‌రౌండర్‌గా రాణించిన ఆయన భారత్ తరఫున 29 టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడారు. మీడియం పేస్ బౌలర్‌గా 47 వికెట్లు పడగొట్టి, అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకరిగా గుర్తింపు పొందారు.

వివరాలు 

క్రికెట్‌ ప్రయాణం 

1967-68లో బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్‌లో అరంగేట్రం చేసిన అబిద్‌,తొలి మ్యాచ్‌లోనే 55 పరుగులు చేయడంతో పాటు ఆరు వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన చేశారు. బ్యాటింగ్‌లో మాత్రమే కాకుండా బౌలింగ్‌లోనూ రాణించడంతో పాటు ఫీల్డింగ్‌లోనూ మెరిశారు. వికెట్ల మధ్య వేగంగా పరుగులు పూర్తి చేసే సామర్థ్యంతో పాటు అద్భుతమైన ఫీల్డర్‌గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. 1967-68 సీజన్‌లో బ్రిస్బేన్‌లో జరిగిన మ్యాచ్‌లో సిక్సర్‌తో తన టెస్ట్‌ కెరీర్‌ను ప్రారంభించిన అబిద్‌, 1958-59లో హైదరాబాద్‌ జూనియర్‌ జట్టులో చేరి, తదుపరి రంజీ ట్రోఫీ జట్టుకు ఎంపికయ్యారు. 1969లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ పర్యటనలకు ఎంపికై, ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో కెప్టెన్ ఎంఏకే పటౌడి స్థానంలో ఆడి, రెండు ఇన్నింగ్స్‌లలో 33 పరుగులు చేశారు.

వివరాలు 

నాన్ స్ట్రయికర్‌గా అబిద్

అదే మ్యాచ్‌లో 55 పరుగులకే 6 వికెట్లు తీసి తన బౌలింగ్ నైపుణ్యాన్ని చాటారు. మూడో టెస్టులో ఓపెనర్‌గా వచ్చి 47 పరుగులు చేసిన అబిద్‌, చివరి టెస్టులో 81, 78 పరుగులు చేశారు. 1971లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్ టెస్ట్‌లో వెస్టిండీస్‌పై సునీల్ గవాస్కర్ విజయం సాధించినప్పుడు, అబిద్ నాన్ స్ట్రయికర్‌గా ఉన్నారు. సిరీస్‌ చివరి టెస్టులో అబిద్ వరుసగా రెండు బంతుల్లో రోహన్ కన్హాయ్, గ్యారీ సోబర్స్‌లను బౌల్డ్‌ చేసి భారత విజయానికి కీలకంగా మారారు. 1975 ప్రపంచ కప్‌లో న్యూజిలాండ్‌పై 70 పరుగులు చేసి మెరుగైన ప్రదర్శన చేశారు.

వివరాలు 

గణాంకాలు.. విశేషాలు 

అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో 29 మ్యాచ్‌లు ఆడిన అబిద్‌ అలీ, 1,018 పరుగులు సాధించారు. వన్డేల్లో 5 మ్యాచ్‌లు ఆడి 93 పరుగులు చేశారు. టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ 81, వన్డేల్లో 70. టెస్టుల్లో 47 వికెట్లు, వన్డేల్లో 7 వికెట్లు తీశారు. రంజీ ట్రోఫీలో హైదరాబాద్‌ తరఫున 2,000 పరుగులు చేసి, 100 వికెట్లు తీశారు. 1968-69లో కేరళపై 173 నాటౌట్ అత్యధిక స్కోరు, 1974లో ఓవల్‌లో సర్రేపై 23 పరుగులకే 6 వికెట్లు తీసి ఉత్తమ బౌలింగ్ ప్రదర్శన చేశారు.

వివరాలు 

కోచ్‌గా సేవలు 

1980లో కాలిఫోర్నియాకు వెళ్లే ముందు, హైదరాబాద్‌ జూనియర్‌ జట్టుకు శిక్షణ ఇచ్చారు. 1990 చివరలో మాల్దీవుల క్రికెట్ జట్టుకు కోచ్‌గా, 2001-02లో రంజీ ట్రోఫీలో సౌత్ జోన్ లీగ్ గెలిచిన ఆంధ్రా జట్టుకు కోచ్‌గా, 2002-2005 మధ్యకాలంలో యూఏఈ జట్టుకు శిక్షణ అందించారు. ఇటీవల కాలంలో కాలిఫోర్నియాలో నివాసం ఉంటూ, స్టాన్‌ఫోర్డ్‌ క్రికెట్‌ అకాడమీలో యువ క్రికెటర్లకు శిక్షణ ఇచ్చారు. భారత క్రికెట్‌లో గొప్ప ఆల్‌రౌండర్‌గా రాణించిన సయ్యద్‌ అబిద్‌ అలీ, తన అద్భుత ఆటతో అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు.