ICC World Cup Boycotts:బాంబుల భయం నుంచి బోర్డర్ వివాదాల వరకు.. వరల్డ్ కప్‌ల్లో మ్యాచ్‌లకు నో చెప్పిన జట్లు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ క్రికెట్‌లో ఐసీసీ టోర్నీలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆటగాళ్ల మధ్య జరిగే ఉత్కంఠభరిత పోరాటాలే కాదు.. కొన్ని సందర్భాల్లో దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతలు, భద్రతా భయాలు కూడా ఈ మెగా ఈవెంట్లను ప్రభావితం చేశాయి. తాజాగా 2026 టీ20 ప్రపంచకప్ సందర్భంగా భారత్‌లో ఆడేందుకు బంగ్లాదేశ్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో, గతంలో వరల్డ్ కప్‌లలో చోటు చేసుకున్న ఇలాంటి వివాదాలు మళ్లీ చర్చకు వచ్చాయి. గత మూడు దశాబ్దాల్లో జట్లు వరల్డ్ కప్ మ్యాచ్‌లు ఆడేందుకు నిరాకరించిన ఆరు ప్రధాన ఘటనలు ఇవి.
Details
1996 వన్డే వరల్డ్ కప్
క్రికెట్ చరిత్రలో తొలిసారి ఒక పెద్ద జట్టు వరల్డ్ కప్ మ్యాచ్ ఆడేందుకు నిరాకరించిన సంఘటన ఇది. భారత్, పాకిస్థాన్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించిన ఈ టోర్నీ సమయంలో శ్రీలంకలో ఎల్టీటీఈ అంతర్యుద్ధం తీవ్రంగా కొనసాగుతోంది. కొలంబో సెంట్రల్ బ్యాంక్ సమీపంలో జరిగిన భారీ బాంబు పేలుడు తర్వాత భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్లు శ్రీలంకలో మ్యాచ్‌లు ఆడేందుకు అంగీకరించలేదు. ఐసీసీ భద్రతా హామీలు ఇచ్చినా ఫలితం లేకపోయింది. దీంతో శ్రీలంకకు వాకోవర్ లభించింది. ఆసక్తికరంగా అదే ఏడాది శ్రీలంక వరల్డ్ కప్ విజేతగా నిలిచింది.
Details
2003 వన్డే వరల్డ్ కప్ - ఇంగ్లండ్ నిర్ణయం
సౌతాఫ్రికా, జింబాబ్వే, కెన్యా సంయుక్తంగా నిర్వహించిన ఈ వరల్డ్ కప్‌లో జింబాబ్వే రాజకీయ పరిస్థితులు వివాదాస్పదంగా మారాయి. అప్పటి అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే పాలనపై తీవ్ర నిరసనలు, మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో హరారేలో జింబాబ్వేతో మ్యాచ్ ఆడేందుకు ఇంగ్లండ్ జట్టు నిరాకరించింది. భద్రత కంటే రాజకీయ కారణాలే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమయ్యాయి. దీని వల్ల ఇంగ్లండ్ కీలక పాయింట్లు కోల్పోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది.
Details
2003 వన్డే వరల్డ్ కప్ - న్యూజిలాండ్ వైఖరి
అదే టోర్నీలో మరో వివాదం చోటుచేసుకుంది. నైరోబీలో భద్రతా పరిస్థితులు సరిగా లేవని, తీవ్రవాద ముప్పు ఉందని పేర్కొంటూ న్యూజిలాండ్ జట్టు కెన్యాతో మ్యాచ్ ఆడేందుకు నిరాకరించింది. ఐసీసీ ఎంతగా ఒత్తిడి చేసినా కివీస్ తమ నిర్ణయాన్ని మార్చలేదు. ఫలితంగా కెన్యాకు వాకోవర్ ద్వారా పాయింట్లు దక్కాయి. ఆ అదనపు పాయింట్లతో కెన్యా సెమీఫైనల్ వరకు చేరి చరిత్ర సృష్టించింది.
Details
2009 టీ20 వరల్డ్ కప్
ఈసారి వివాదం భద్రతకు కాకుండా దౌత్య సంబంధాలకు సంబంధించినది. బ్రిటన్ ప్రభుత్వంతో ఉన్న రాజకీయ విభేదాల కారణంగా జింబాబ్వే జట్టు ఇంగ్లండ్‌లో జరగాల్సిన టీ20 వరల్డ్ కప్ నుంచి తప్పుకుంది. జింబాబ్వే ఆటగాళ్లకు వీసాలు ఇవ్వడాన్ని బ్రిటన్ ప్రభుత్వం నిరాకరించడంతో ఈ పరిస్థితి తలెత్తింది. దాంతో ఐసీసీ జింబాబ్వే స్థానంలో స్కాట్లాండ్‌కు అవకాశం ఇచ్చింది. 2016 అండర్-19 వరల్డ్ కప్ బంగ్లాదేశ్ వేదికగా జరిగిన ఈ టోర్నీకి ఆస్ట్రేలియా జట్టు హాజరు కాలేదు. బంగ్లాదేశ్‌లో ఉగ్రవాద దాడుల ముప్పు ఉందని తమ గూఢచారి సంస్థలు హెచ్చరించడంతో ఆసీస్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ఐసీసీ అత్యున్నత భద్రత కల్పిస్తామని చెప్పినా ఆస్ట్రేలియా వెనక్కి తగ్గలేదు. వారి స్థానంలో ఐర్లాండ్ జట్టును టోర్నీలోకి తీసుకున్నారు.
Details
2026 టీ20 వరల్డ్ కప్ - తాజా వివాదం
ఇప్పటి తాజా ఘటన 2026 టీ20 వరల్డ్ కప్‌కు సంబంధించింది. భారత్‌లో జరిగే మ్యాచ్‌లకు బంగ్లాదేశ్ రావడానికి అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత్-బంగ్లాదేశ్ మధ్య ఉన్న దౌత్యపరమైన ఉద్రిక్తతలే దీనికి కారణమని సమాచారం. తమ మ్యాచ్‌లను న్యూట్రల్ వేదిక అయిన శ్రీలంకకు మార్చాలని బీసీబీ ఐసీసీని కోరింది. అయితే భారత్‌లో భద్రతాపరమైన సమస్యలు లేవని ఐసీసీ ఇప్పటికే స్పష్టం చేసింది. అయినా బంగ్లాదేశ్ తన వైఖరిపై నిలబడటంతో ఐసీసీ కఠిన చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనలు చూస్తే, వరల్డ్ కప్‌ల్లో ఆటతో పాటు రాజకీయాలు, భద్రత కూడా ఎంత ప్రభావం చూపుతాయో స్పష్టంగా అర్థమవుతోంది.