IPL 2026: ఆర్సీబీ నుంచి రాజస్థాన్ వరకూ.. ఎవరు గెలిచినా కామన్ పాయింట్ ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2026 సీజన్‌లో లీగ్ దశ ముగిసింది. ఇక మంగళవారం నుంచి ప్లేఆఫ్స్ పోరు ప్రారంభంకానుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు నాకౌట్ దశకు అర్హత సాధించాయి. పాయింట్ల పట్టికను పరిశీలిస్తే ఆర్సీబీ, గుజరాత్ జట్లు మెరుగైన నెట్‌రన్‌రేట్‌తో బలంగా కనిపిస్తున్నప్పటికీ.. మిగతా రెండు జట్లను కూడా తేలికగా తీసుకునే పరిస్థితి లేదు.
వివరాలు
ఇక పాయింట్ల పట్టికతో పని లేదు!
లీగ్ దశలో జరిగిన పోరు ఒకటి అయితే.. ప్లేఆఫ్స్‌లో జరగబోయే సమరం మరోలా ఉండబోతోంది. ఇక నుంచి పాయింట్ల పట్టికకు పెద్దగా ప్రాధాన్యం లేదు. గెలిస్తేనే ముందుకు సాగగలరు. ముఖ్యంగా మూడో, నాలుగో స్థానాల్లో నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్‌కు ప్రతి మ్యాచ్ నాకౌట్‌లాంటిదే. గెలిస్తేనే టైటిల్ వేట కొనసాగుతుంది.. ఓడితే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది.
వివరాలు
గెలిస్తే రెండో టైటిల్‌నే!
ఈసారి ప్లేఆఫ్స్‌లో మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. పోటీలో ఉన్న నాలుగు జట్లలో ఏది టైటిల్ గెలిచినా.. అది ఆ జట్టుకు రెండో ఐపీఎల్ ట్రోఫీ అవుతుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఆర్సీబీ.. 18 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలుకుతూ గత సీజన్‌లో తొలి టైటిల్ గెలుచుకుంది. ఈసారి మళ్లీ విజేతగా నిలిస్తే రెండో కప్పును అందుకుంటుంది. గుజరాత్ టైటాన్స్ 2022లో ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తొలి సీజన్‌లోనే ఛాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించింది. ఈ ఏడాది టైటిల్ సాధిస్తే ఆ జట్టుకు కూడా ఇది రెండో ట్రోఫీ అవుతుంది.
వివరాలు
2016లో ఛాంపియన్ గా సన్ రైజర్స్
సన్‌రైజర్స్ హైదరాబాద్ 2016లో ఐపీఎల్ విజేతగా నిలిచింది. ఆ తర్వాత మళ్లీ టైటిల్ అందుకోలేకపోయింది. ఈసారి మరోసారి కప్ గెలవాలనే పట్టుదలతో బరిలోకి దిగుతోంది. షేన్ వార్న్ నాయకత్వంలో రాజస్థాన్ రాయల్స్ 2008లో తొలి ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. అయితే అప్పటి నుంచి మళ్లీ ట్రోఫీ దక్కలేదు. ఈసారి ఆ నిరీక్షణకు తెరదించాలని రాజస్థాన్ ఆశిస్తోంది. ఈ నేపథ్యంలో.. ప్లేఆఫ్స్‌లో ఉన్న ఈ నాలుగు జట్లలో ఏది ఛాంపియన్‌గా నిలిచినా.. రెండోసారి ఐపీఎల్ టైటిల్ గెలిచిన జట్టుగా రికార్డు సృష్టించనుంది.