Loading...
Harshal Patel Trade: రూ.8 కోట్ల నుంచి రూ.4 కోట్లకు.. హర్షల్ పటేల్ కోసం గుజరాత్ భారీ ప్లాన్!
రూ.8 కోట్ల నుంచి రూ.4 కోట్లకు.. హర్షల్ పటేల్ కోసం గుజరాత్ భారీ ప్లాన్!

Harshal Patel Trade: రూ.8 కోట్ల నుంచి రూ.4 కోట్లకు.. హర్షల్ పటేల్ కోసం గుజరాత్ భారీ ప్లాన్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 17, 2026
10:00 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ఆటగాళ్ల ట్రేడింగ్‌లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది. రెండుసార్లు పర్పుల్ క్యాప్ అందుకున్న భారత పేసర్ హర్షల్ పటేల్ సన్‌ రైజర్స్ హైదరాబాద్ (SRH) నుంచి గుజరాత్ టైటాన్స్ (GT)కు మారనున్నట్లు సమాచారం. ఆల్ క్యాష్ ట్రేడ్‌లో భాగంగా అతడిని రూ.4 కోట్లకు తీసుకునేందుకు గుజరాత్ ఫ్రాంచైజీ అంగీకరించినట్లు ESPNcricinfo తన కథనంలో వెల్లడించింది. 2025 మెగా వేలంలో హర్షల్ పటేల్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.8 కోట్లు వెచ్చించింది. ఇప్పుడు అందులో సగం ధరకు అతడిని గుజరాత్ టైటాన్స్ దక్కించుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ ట్రేడ్ డీల్ పూర్తయితే గుజరాత్ వేలం పర్స్ నుంచి రూ.4 కోట్లు తగ్గనున్నాయి.

వివరాలు

ఐదో ఐపీఎల్ ఫ్రాంచైజీగా గుజరాత్

ఈ ట్రేడ్ ఖరారైతే హర్షల్ పటేల్ తన ఐపీఎల్ కెరీర్‌లో ఐదో ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించనున్నాడు.

2012లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన అతడు ఇప్పటివరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల తరఫున ఆడాడు.

ఇప్పుడు గుజరాత్ టైటాన్స్‌కు మారే అవకాశం ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున తొలి సీజన్‌లో హర్షల్ మంచి ప్రదర్శన చేశాడు.

2025లో 13 మ్యాచ్‌లు ఆడి 16 వికెట్లు పడగొట్టాడు. అయితే అతడి ఎకానమీ రేటు 9.80గా నమోదైంది. దీంతో 2026 సీజన్‌లో అతడికి పెద్దగా అవకాశాలు దక్కలేదు.

కేవలం ఐదు మ్యాచ్‌ల్లో మాత్రమే బరిలోకి దిగి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఓవర్‌కు 10.82 పరుగులు సమర్పించుకున్నాడు.

వివరాలు

రెండుసార్లు పర్పుల్ క్యాప్ విజేత

ఈ సీజన్‌లో అన్‌క్యాప్డ్ భారత పేసర్లు ప్రఫుల్ హింగే, సకిబ్ హుస్సేన్‌లకు సన్‌రైజర్స్ ఎక్కువ అవకాశాలు కల్పించింది.

హర్షల్ పటేల్ ఐపీఎల్ కెరీర్‌లో 2021, 2024 సీజన్లు ప్రత్యేకంగా నిలిచాయి. 2021లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున 32 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ అందుకున్నాడు.

ఆ తర్వాత 2024లో పంజాబ్ కింగ్స్ తరఫున 24 వికెట్లు తీసి మరోసారి టోర్నీలో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా నిలిచాడు.

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జన్మించిన హర్షల్‌కు ఈ మార్పు ఒకరకంగా సొంత ప్రాంతానికి తిరిగి వచ్చినట్లే. దేశవాళీ క్రికెట్‌లో ఆడేందుకు కొన్నేళ్ల క్రితమే గుజరాత్‌కు మారాడు.

ADVERTISEMENT

వివరాలు

హర్షల్ కోసం గతంలోనూ ప్రయత్నించిన గుజరాత్

గుజరాత్ టైటాన్స్ పేస్ విభాగంలో ఇప్పటికే కగిసో రబడా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, జేసన్ హోల్డర్ వంటి ఆటగాళ్లు ఉన్నారు.

హర్షల్ కూడా జట్టులో చేరితే బౌలింగ్ విభాగం మరింత పటిష్టం కానుంది. హర్షల్ పటేల్‌ను దక్కించుకునేందుకు గుజరాత్ టైటాన్స్ గతంలోనూ ప్రయత్నించింది. 2024 వేలంలో అతడి కోసం రూ.10.5 కోట్ల వరకు బిడ్ వేసింది.

అయితే పంజాబ్ కింగ్స్ రూ.11.75 కోట్లకు అతడిని సొంతం చేసుకుంది. 2025 మెగా వేలంలోనూ గుజరాత్ హర్షల్‌ను తీసుకునేందుకు ప్రయత్నించింది.

బిడ్డింగ్ రూ.6.5 కోట్లకు చేరిన తర్వాత వెనక్కి తగ్గింది. ఇప్పుడు ట్రేడ్ ద్వారా అతడిని జట్టులోకి తీసుకునే అవకాశం ఏర్పడింది.

ADVERTISEMENT

వివరాలు

ఆటగాళ్ల బదిలీలపై దృష్టి

ఐపీఎల్ 2027రిటెన్షన్ గడువు సమీపిస్తుండటంతో ఫ్రాంచైజీలు ఆటగాళ్ల బదిలీలపై దృష్టి సారించాయి.

సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా ట్రేడింగ్‌లో చురుగ్గా వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి లెఫ్టార్మ్ పేసర్ టి. నటరాజన్‌ను తీసుకున్నట్లు సమాచారం.

అలాగే చెన్నై సూపర్ కింగ్స్‌తో నాలుగు ఆటగాళ్ల ట్రేడ్‌లో భాగంగా ఖలీల్ అహ్మద్, నాథన్ ఎల్లిస్‌లను కూడా జట్టులోకి తీసుకున్నట్లు నివేదికలు వెల్లడించాయి.

ADVERTISEMENT