T20 World Cup: విరాట్ కోహ్లీ నుంచి రోహిత్ శర్మ వరకూ.. టీ20 వరల్డ్‌కప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే!
ఈ వార్తాకథనం ఏంటి
మరో నెల రోజుల్లో క్రికెట్ అభిమానులకు పండగ వాతావరణం నెలకొనబోతోంది. పొట్టి క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్ కు రంగం సిద్ధమైంది. ఫిబ్రవరి 7 నుంచి భారత్-శ్రీలంక సంయుక్త ఆతిథ్యంలో ఈ మెగా టోర్నీ అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఈసారి ప్రపంచ కప్‌కు ప్రత్యేకత ఏమిటంటే.. తొలిసారిగా ఏకంగా 20 జట్లు పోటీపడుతున్నాయి. అలాగే, ఆసియా ఖండం నుంచి రికార్డు స్థాయిలో 8 జట్లు బరిలోకి దిగడం కూడా విశేషంగా నిలుస్తోంది. ప్రపంచ కప్ ఆరంభానికి ఇక నెల రోజుల కంటే తక్కువ సమయమే ఉండటంతో, డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న టీమిండియాపై అంచనాలు భారీగా పెరిగాయి.
Details
టీమిండియా బ్యాటర్లే అధిపత్యం
మరోసారి కప్పు గెలిచి ఆధిపత్యాన్ని చాటాలనే లక్ష్యంతో భారత జట్టు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో గత టీ20 ప్రపంచ కప్‌ల గణాంకాలను పరిశీలిస్తే పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా గత ఐదు టీ20 ప్రపంచ కప్‌లలో భారత జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో భారత స్టార్‌ల ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఇందులో ఒక ఆటగాడు మాత్రం పదే పదే ఈ ఘనత సాధించి 'రికార్డుల మెషిన్'గా నిలిచాడు.
Details
విరాట్ కోహ్లీ విశ్వరూపం - 2014
2014 టీ20 ప్రపంచ కప్ భారత అభిమానులకు చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. ఫైనల్‌లో శ్రీలంక చేతిలో ఓడిన భారత్ టైటిల్‌ను చేజార్చుకుంది. అయితే ఆ టోర్నీలో విరాట్ కోహ్లీ ప్రదర్శన మాత్రం అసాధారణం. కేవలం 6 మ్యాచ్‌ల్లోనే 314 పరుగులు సాధించి సంచలనం సృష్టించాడు. ఆ ఏడాది కోహ్లీ అత్యుత్తమ ఫామ్‌లో ఉండి, పరుగుల వరద పారించాడు.
Details
వన్ మ్యాన్ ఆర్మీగా కోహ్లీ - 2016
2016లో భారత్‌లో జరిగిన టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా సెమీఫైనల్‌లో వెస్టిండీస్ చేతిలో పరాజయం పాలైంది. అయినప్పటికీ, విరాట్ కోహ్లీ మరోసారి 'వన్ మ్యాన్ ఆర్మీ'లా జట్టును ముందుండి నడిపించాడు. జట్టు ఒత్తిడిలో ఉన్న ప్రతిసారీ కోహ్లీ అండగా నిలిచాడు. ఆ టోర్నీలో 5 మ్యాచ్‌ల్లో 273 పరుగులు చేసి, భారత జట్టుకు టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కేఎల్ రాహుల్ క్లాస్ ఇన్నింగ్స్ 2021 2021 టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోయినా,ఓపెనర్ కేఎల్ రాహుల్ మాత్రం తన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఆఎడిషన్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రాహుల్ రికార్డుల్లోకి ఎక్కాడు. 5 మ్యాచ్‌ల్లో 194 పరుగులు సాధించి, టీమిండియా టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
Details
రికార్డుల రారాజు మళ్లీ విరాటే - 2022
ఆస్ట్రేలియాలో జరిగిన 2022 టీ20 ప్రపంచ కప్‌లోనూ విరాట్ కోహ్లీ తన ఆధిపత్యాన్ని కొనసాగించాడు. ఈ టోర్నీలో కూడా భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కోహ్లీ నిలిచాడు. ముఖ్యంగా ఈ ఎడిషన్‌లో కోహ్లీ తన టీ20 అంతర్జాతీయ కెరీర్‌లో ఏకైక శతకాన్ని నమోదు చేయడం విశేషం. మొత్తం 6 మ్యాచ్‌ల్లో 296 పరుగులు చేసి మరోసారి తన సత్తా చాటాడు.
Details
హిట్‌మ్యాన్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ - 2024
2024 టీ20 ప్రపంచ కప్ భారత క్రికెట్ చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలిచింది. దాదాపు 17 ఏళ్ల నిరీక్షణ తర్వాత టీమిండియా మరోసారి టీ20 ప్రపంచ కప్‌ను ముద్దాడింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ విశ్వవిజేతగా నిలిచింది. కేవలం నాయకత్వంలోనే కాకుండా, బ్యాటింగ్‌లోనూ రోహిత్ ముందుండి జట్టును నడిపించాడు. ఆ టోర్నీలో రోహిత్ శర్మ 8 మ్యాచ్‌ల్లో 257 పరుగులు చేసి, భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 98 పరుగులతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయంలోకి నడిపించాడు. ప్రపంచ కప్ గెలిచిన అనంతరం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.