Harbhajan - Gambhir: గంభీర్ నిజాన్ని నిక్కచ్చిగా చెబుతాడు.. అందుకే విమర్శలు: హర్భజన్ సింగ్
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌పై వస్తున్న విమర్శలను మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఖండించాడు. జట్టు ఏదైనా మ్యాచ్ లేదా సిరీస్‌లో ఓడిపోగానే వెంటనే కోచ్‌ను నిందించడం సరైన పద్ధతి కాదని హితవు పలికాడు. గంభీర్ ముక్కుసూటిగా వ్యవహరించే వ్యక్తి అని ప్రశంసించిన హర్భజన్.. అతడి నిర్ణయాలు కొందరికి నచ్చకపోవడానికి అదే కారణం కావచ్చని పేర్కొన్నాడు. గంభీర్ కోచింగ్‌లో భారత జట్టు ఐసీసీ టోర్నీలను గెలిచిన విషయాన్ని కూడా గుర్తు చేశాడు. 'గంభీర్ ఎందుకు ఇంతలా విమర్శలు ఎదుర్కొంటున్నాడో నాకు అర్థం కావడం లేదు. జట్టు సరిగ్గా ఆడకపోతే వెంటనే కోచ్‌నే బాధ్యుడిని చేయడం ఎందుకు? అతడు క్రికెట్ ఆడుతున్నప్పటి నుంచీ నాకు తెలుసు.
వివరాలు
కెరీర్ ప్రారంభంతో తక్కువగా మాట్లాడేవాడు
ఆటపట్ల ఎంతో నిబద్ధత ఉన్న వ్యక్తి. కెరీర్ ప్రారంభంలో గంభీర్ చాలా తక్కువగా మాట్లాడేవాడు
సెహ్వాగ్, అమిత్ మిశ్రా, మునాఫ్ పటేల్ అతడికి మంచి స్నేహితులు. ఇప్పటికీ వారితో స్నేహం కొనసాగుతుందనే అనుకుంటున్నా.
గంభీర్ ముక్కుసూటి మనిషి. తనకు అనిపించిన వాస్తవాలను నేరుగా మాట్లాడతాడు. అందుకే అతడి కొన్ని నిర్ణయాలు కొందరికి నచ్చకపోవచ్చు.
అయితే పైకి కనిపించే తీరును బట్టి ఒక వ్యక్తిని అంచనా వేయకూడదని పెద్దలు చెబుతారు. గంభీర్‌ను కూడా అలాగే విమర్శించడం సరికాదు. విజయం కోసమే ఆడాలనే బలమైన నమ్మకం అతడికి ఉంది.
ఓటమిని కనీసం ఊహించడానికి కూడా ఇష్టపడడు. డ్రా కోసం ఆడటానికి కూడా అతడు పెద్దగా ఆసక్తి చూపడు'' అని హర్భజన్ చెప్పాడు.
వివరాలు
శుభ్‌మన్ గిల్ విజయానికి కారణమేంటి?
శుభ్‌మన్ గిల్ గురించి హర్భజన్ మాట్లాడుతూ.. ఎవరికైనా విజయం ఒక్కసారిగా దక్కదని, గిల్ విషయంలోనూ అదే జరిగిందని అన్నాడు.
'ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో గిల్ కెప్టెన్సీని చూశాం. అతడి సామర్థ్యం ఏంటో అందరికీ అర్థమైంది. బ్యాటర్‌గా పరుగులు చేశాడు.
కెప్టెన్‌గా జట్టును కూడా బాగా నడిపించాడు. ప్రతిఆటగాడి కెరీర్‌లో ఒడుదొడుకులు సహజం.
గిల్‌కు మంచి క్రికెట్ బ్రెయిన్ ఉంది. వ్యక్తిగతంగానూ అతడు అద్భుతమైన వ్యక్తి'' అని హర్భజన్ ప్రశంసించాడు.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వన్డే క్రికెట్‌లో కొనసాగడంపై వస్తున్న చర్చపైనా హర్భజన్ స్పందించాడు. 'లియోనెల్ మెస్సి, క్రిస్టియానో రొనాల్డో ఇప్పటికీ ఫుట్‌బాల్ ఆడుతున్నారు.
అలాంటప్పుడు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వన్డేల్లో కొనసాగితే తప్పేంటి? ఏ ఆటగాడికైనా ప్రదర్శనే అసలు కొలమానం.
వివరాలు
పరుగులు చేస్తున్నప్పుడు వయసెందుకు?
వయసు అంత ముఖ్యమైన విషయం కాదు. విరాట్ వయసు 37 ఏళ్లు దాటినా.. 20ఏళ్ల యువకుడిలా మైదానంలో చురుగ్గా ఉంటాడు.
మెస్సిని అడ్డుకోవాలంటే ఇప్పటికీ ఐదుగురు ఆటగాళ్లు అవసరమవుతారు. భారత జట్టులో ఫిట్‌నెస్ విషయంలో మార్పులు తీసుకొచ్చిన వారిలో కోహ్లీ ముందుంటాడు.
చివరి రోజు 400పరుగులు చేయాల్సి వచ్చినా విజయమే లక్ష్యంగా పోరాడాలని సహచరుల్లో స్ఫూర్తి నింపుతాడు.
ఒకవేళ ఆ రోజు ఓడిపోయినా.. మరో రోజు సాధించి తీరుతామని చెప్పేవాడు. వైభవ్ సూర్యవంశీ దూకుడు గురించి మనందరికీ తెలుసు.
అయితే విరాట్, రోహిత్‌లకు అపారమైన అనుభవం ఉంది.
ప్రస్తుతం వాళ్లు ఎలా ఆడుతున్నారనేదే ముఖ్యం. ఇటీవలి మ్యాచ్‌ల్లో వారి ప్రదర్శనను చూస్తే ఇద్దరూ విజయవంతంగానే కొనసాగుతున్నారని చెప్పొచ్చు'' అని హర్భజన్ సింగ్ వెల్లడించాడు.