LOADING...
LSG vs GT : హాఫ్ సెంచరీలతో చెలరేగిన గిల్, బట్లర్.. లక్నోపై గుజరాత్ గెలుపు
హాఫ్ సెంచరీలతో చెలరేగిన గిల్, బట్లర్.. లక్నోపై గుజరాత్ గెలుపు

LSG vs GT : హాఫ్ సెంచరీలతో చెలరేగిన గిల్, బట్లర్.. లక్నోపై గుజరాత్ గెలుపు

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 12, 2026
07:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2026లో భాగంగా ఏకనా స్టేడియంలో జరిగిన కీలక మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై గుజరాత్ టైటాన్స్ ఘన విజయాన్ని నమోదు చేసింది. లక్నో నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ బ్యాటర్లు సమర్థవంతంగా ఛేదించి విజయం సాధించారు. జోష్ బట్లర్, శుభ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీలతో మెరిసి జట్టుకు విజయాన్ని సునాయసంగా అందించారు. అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ గుజరాత్ టైటాన్స్ బౌలర్ల ధాటికి కట్టడి అయింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 164 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్నో తరఫున ఐడెన్ మార్క్రమ్ 30 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

వివరాలు

విఫలమైన లక్నో బ్యాటర్లు

మిగతా బ్యాటర్లలో నికోలస్ పూరన్ 19, రిషబ్ పంత్ 18, అబ్దుల్ సమద్ 18, ముకుల్ చౌదరీ 18, జార్జ్ లిండే 16, మహమ్మద్ షమీ 12, మిచెల్ మార్ష్ 11 పరుగులు మాత్రమే చేశారు. 165 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్ టైటాన్స్‌కు శుభారంభం లభించింది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ మధ్య 45 పరుగుల భాగస్వామ్యం నెలకొనగా, దిగ్వేశ్ సింగ్ రాఠీ ఈ జోడిని విడదీశాడు. సాయి సుదర్శన్ 15 పరుగులకే అవుట్ అయ్యాడు. తర్వాత జోష్ బట్లర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించిన శుభ్‌మన్ గిల్ 40 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సుతో 56 పరుగులు చేసి హాఫ్ సెంచరీ సాధించాడు.

వివరాలు

రాణించిన గుజరాత్ బ్యాటర్లు

129 పరుగుల వద్ద ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో రిషభ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి గిల్ పెవిలియన్ చేరాడు. మరోవైపు జోష్ బట్లర్ 37 బంతుల్లో 11 ఫోర్లతో 60 పరుగులు చేసి అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. అనంతరం మహమ్మద్ షమీ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో బౌండరీ లైన్ వద్ద ఐడెన్ మార్క్రమ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన రాహుల్ తెవాటియా 9 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 11 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సుతో 20 పరుగులు చేసి మ్యాచ్‌ను ముగించారు. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో దిగ్వేశ్ రాఠీ, మహమ్మద్ షమీ, ప్రిన్స్ యాదవ్ తలో వికెట్ సాధించారు.

Advertisement