Page Loader
Shubham Gill: ఇంగ్లండ్ గడ్డపై గిల్ రికార్డులు.. కోహ్లీ, గవాస్కర్ సరసన చోటు సంపాదించుకున్న ప్లేయర్!
ఇంగ్లండ్ గడ్డపై గిల్ రికార్డులు.. కోహ్లీ, గవాస్కర్ సరసన చోటు సంపాదించుకున్న ప్లేయర్!

Shubham Gill: ఇంగ్లండ్ గడ్డపై గిల్ రికార్డులు.. కోహ్లీ, గవాస్కర్ సరసన చోటు సంపాదించుకున్న ప్లేయర్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 06, 2025
08:52 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా యువ కెప్టెన్ శుభమాన్ గిల్ అద్భుత ప్రదర్శనతో రాణిస్తున్నాడు. మొదటి టెస్ట్ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 147 పరుగులతో సెంచరీ సాధించిన గిల్, రెండో ఇన్నింగ్స్‌లో 8 పరుగులు చేశాడు. అయితే రెండో టెస్ట్‌లో గిల్‌ తన ఫామ్‌ను పునరావృతం చేస్తూ తొలి ఇన్నింగ్స్‌లో అద్భుతమైన ద్విశతకం (269) నమోదు చేశాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో కూడా భిన్నమైన శైలిలో 161 పరుగులతో మరో శతకం నమోదు చేశాడు. అతని విధ్వంసకర ఆటతీరుతో భారత్ రెండో టెస్ట్‌ గెలుపు కరవు దరిదాపుల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో గిల్ తన ఖాతాలో పలు రికార్డులను వేసుకున్నాడు.

Details

మొదటి స్థానంలో గిల్

రెండో టెస్టులో మొత్తం 430 పరుగులు చేసిన గిల్, ఒకే టెస్ట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్‌ దిగ్గజ ఆటగాడు గ్రాహం గూచ్‌ 456 పరుగులతో ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు. అంతేకాదు, ఓ టెస్ట్ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో 150కు పైగా పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా గిల్ చరిత్రలో నిలిచాడు. ఈ అరుదైన ఘనతను ముందు అలెన్ బోర్డర్‌ 1980లో పాకిస్థాన్‌పై 150, 153 పరుగులతో సాధించాడు. అలాగే ఓ టెస్టులో సెంచరీ, డబుల్ సెంచరీ చేసిన తొమ్మిదో ఆటగాడిగా గిల్ నిలిచాడు.

Details

మూడో టీమిండియా కెప్టెన్‌గా గిల్ చరిత్ర

ఈ జాబితాలో భారత్‌ తరఫున సునీల్ గవాస్కర్‌ కూడా ఉన్నారు. అంతేకాకుండా, టెస్ట్ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు చేసిన మూడో టీమిండియా కెప్టెన్‌గా గిల్ చరిత్ర సృష్టించాడు. గతంలో సునీల్ గవాస్కర్, విరాట్ కోహ్లీ మాత్రమే ఈ ఘనతను సాధించారు. ఎడ్జ్‌బాస్టన్‌ టెస్టులో గిల్ నాలుగు శతక భాగస్వామ్యాల్లోనూ భాగస్వామిగా నిలిచాడు. ఓ టెస్ట్‌లో నాలుగు సెంచరీ భాగస్వామ్యాల్లో భాగమైన తొలి భారత ఆటగాడిగా మరో అరుదైన రికార్డును తన పేరుపై లిఖించుకున్నాడు. ఇంకా మూడు టెస్టులు మిగిలి ఉండడంతో, గిల్ నుంచి మరిన్ని రికార్డుల వేట కనిపించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.