LOADING...
T20 World Cup 2026: వరల్డ్‌కప్‌ రేసులో గిల్‌, శాంసన్‌.. రేపే భారత జట్టు ప్రకటన
వరల్డ్‌కప్‌ రేసులో గిల్‌, శాంసన్‌.. రేపే భారత జట్టు ప్రకటన

T20 World Cup 2026: వరల్డ్‌కప్‌ రేసులో గిల్‌, శాంసన్‌.. రేపే భారత జట్టు ప్రకటన

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 19, 2025
09:32 am

ఈ వార్తాకథనం ఏంటి

టీ20 వరల్డ్‌కప్‌ 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనుంది. ఈ మెగా టోర్నీకి సంబంధించిన సన్నాహకాల్లో భాగంగా, దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌ చివరి మ్యాచ్‌ ముగిసిన వెంటనే రేపు (డిసెంబర్‌ 20న) భారత జట్టును బీసీసీఐ ప్రకటించనుంది. వరల్డ్‌కప్‌కు ముందు భారత్‌కు ఇంకా ఐదు టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉండటంతో, ప్రస్తుతం ఎంపికయ్యే జట్టే మెగా టోర్నీలో ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నదిగా క్రికెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆటగాళ్ల ఫామ్‌తో పాటు సమతూకం కలిగిన జట్టును ఎంపిక చేయడం సెలెక్టర్ల ముందున్న అతిపెద్ద సవాల్‌గా మారింది. ప్రస్తుతం టీమిండియాకు ప్రధాన ఆందోళనగా శుభ్‌మన్‌ గిల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ల ఫామ్‌ మారింది.

Details

వికెట్ కీపింగ్ విభాగంలో స్పష్టత లేదు

కెప్టెన్‌గా సూర్యకుమార్‌ యాదవ్‌, వైస్‌ కెప్టెన్‌గా గిల్‌ ఉన్న నేపథ్యంలో, వీరిద్దరిపై సెలెక్టర్లు కఠిన నిర్ణయం తీసుకుంటారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో, టీ20ల్లో అద్భుతమైన రికార్డు ఉన్న యశస్వి జైస్వాల్‌ను ఇటీవల జట్టులోకి తీసుకోకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. వరల్డ్‌కప్‌కు ముందు అతడికి మళ్లీ అవకాశం కల్పిస్తారా? అనే ఆసక్తి నెలకొంది. వికెట్‌కీపర్‌ విభాగంలోనూ ఇంకా స్పష్టత లేదు. ఆసియా కప్‌ 2025 నుంచి జితేశ్‌ శర్మ, సంజూ శాంసన్‌లు కీపర్లుగా కొనసాగుతున్నప్పటికీ, జితేశ్‌ నుంచి చెప్పుకోదగిన ఇన్నింగ్స్‌ రాలేదు.

Details

శ్రేయస్ అయ్యర్ ఎంపికపై అనిశ్చితి

మరోవైపు, సంజూ శాంసన్‌ను బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఎడాపెడా మారుస్తూ చివరకు ప్లేయింగ్‌ ఎలెవన్‌ నుంచే తొలగించారు. ఈ పరిస్థితుల్లో ఇషాన్‌ కిషన్‌, రిషభ్‌ పంత్‌, కేఎల్‌ రాహుల్‌, ధృవ్‌ జురెల్‌లకు మళ్లీ టీ20ల్లో అవకాశం కల్పించే ఆలోచన సెలెక్టర్లకు ఉందా? అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. ఇదిలా ఉండగా, శ్రేయాస్‌ అయ్యర్‌ డిసెంబర్‌ 2023 తర్వాత అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ ఆడలేదు. ప్రస్తుతం గాయానికి చికిత్స తీసుకుంటున్న అతడి వరల్డ్‌కప్‌ అవకాశాలు అనిశ్చితంగా మారాయి. అలాగే దక్షిణాఫ్రికా సిరీస్‌కు రింకు సింగ్‌ను పక్కన పెట్టడం కూడా చర్చకు దారి తీసింది.

Advertisement

Details

అజిత్‌ అగార్కర్‌ నేతృత్వంలో కీలక నిర్ణయాలు

గత కొంతకాలంగా జట్టులో రెగ్యులర్‌గా ఉన్న రింకు, వరుసగా రెండో టీ20 వరల్డ్‌కప్‌ను కోల్పోతాడా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా టీ20 వరల్డ్‌కప్‌ 2026 కోసం భారత జట్టు ఎంపికపై అభిమానుల్లో భారీ ఉత్కంఠ నెలకొంది. అజిత్‌ అగార్కర్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.

Advertisement