LOADING...
Hardik Pandya: టీమిండియాకు గుడ్‌న్యూస్.. పూర్తి ఫిట్‌నెస్ సాధించిన హార్దిక్ పాండ్య!
టీమిండియాకు గుడ్‌న్యూస్.. పూర్తి ఫిట్‌నెస్ సాధించిన హార్దిక్ పాండ్య!

Hardik Pandya: టీమిండియాకు గుడ్‌న్యూస్.. పూర్తి ఫిట్‌నెస్ సాధించిన హార్దిక్ పాండ్య!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 09, 2026
02:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన టీమిండియా ఇప్పుడు మూడు వన్డేల సిరీస్‌పై దృష్టి సారించింది. జూన్ 13 నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్‌కు ముందు భారత జట్టుకు ఊరటనిచ్చే వార్త అందింది. గాయంతో కొంతకాలంగా క్రికెట్‌కు దూరంగా ఉన్న స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య పూర్తిగా కోలుకుని జట్టుకు అందుబాటులోకి వచ్చినట్లు సమాచారం. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఫిట్‌నెస్ పరీక్షలు పూర్తి చేసిన హార్దిక్‌కు వైద్య బృందం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అఫ్గానిస్థాన్‌తో జరిగే వన్డే సిరీస్‌కు అతడు ఎంపికకు సిద్ధమైనట్లు సమాచారం.

వివరాలు

వెన్నునొప్పి కారణంగా కొన్ని మ్యాచులకు దూరం

ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన హార్దిక్ పాండ్య వెన్ను నొప్పి కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరమైన విషయం తెలిసిందే. అనంతరం జూన్ 2 నుంచి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో చికిత్స పొందుతూ పునరావాస కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఐదు రోజులుగా ప్రత్యేక శిక్షణా సెషన్లలో పాల్గొన్న హార్దిక్, పూర్తి స్థాయిలో బౌలింగ్ చేసినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అతడు తన పూర్తి కోటా 10 ఓవర్లను బౌల్ చేయడంతో పాటు శిక్షణ సమయంలో ఎలాంటి అసౌకర్యం అనుభవించలేదని సమాచారం. ఫిట్‌నెస్‌కు సంబంధించిన అన్ని ప్రమాణాల్లోనూ సంతృప్తికర ఫలితాలు సాధించినట్లు తెలుస్తోంది.

వివరాలు

విరాట్ కోహ్లీ దూరం

ముఖ్యంగా 10 ఓవర్ల పూర్తి స్పెల్ బౌలింగ్ చేయడం ద్వారా 50 ఓవర్ల ఫార్మాట్‌కు తాను సిద్ధంగా ఉన్నానని హార్దిక్ నిరూపించినట్లు క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే అతడు నేరుగా ధర్మశాలలో జరిగే తొలి వన్డే మ్యాచ్‌కు జట్టుతో కలుస్తాడా? లేక ముందుగా చండీగఢ్‌లో నిర్వహించే శిక్షణ శిబిరంలో పాల్గొంటాడా? అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. ఇదిలా ఉండగా, తొడ కండరాల గాయం కారణంగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మొత్తం వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. అతడి స్థానంలో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను జట్టులోకి తీసుకున్నట్లు బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది.

Advertisement

వివరాలు

అందుబాటులొ రోహిత్ శర్మ

మరోవైపు సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ కూడా ప్రస్తుతం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లోనే ఉన్నాడు. ఐపీఎల్ సందర్భంగా గాయపడిన రోహిత్ ఆరోగ్య పరిస్థితిని బీసీసీఐ వైద్య బృందం పరిశీలిస్తున్నట్లు సమాచారం. అతడి ఫిట్‌నెస్‌పై తుది నిర్ణయం త్వరలో వెలువడే అవకాశం ఉంది. అఫ్గానిస్థాన్‌తో కీలక వన్డే సిరీస్‌కు ముందు హార్దిక్ పాండ్య పూర్తిగా కోలుకోవడం టీమిండియాకు పెద్ద బలంగా మారనుండగా, కోహ్లీ గైర్హాజరీ జట్టుకు ఎదురుదెబ్బగా మారింది.

Advertisement