LOADING...
ICC: మహిళా క్రికెటర్లకు ఐసీసీ గుడ్ న్యూస్.. ప్రసవం తర్వాత రీఎంట్రీకి కొత్త గైడ్‌లైన్స్!
మహిళా క్రికెటర్లకు ఐసీసీ గుడ్ న్యూస్.. ప్రసవం తర్వాత రీఎంట్రీకి కొత్త గైడ్‌లైన్స్!

ICC: మహిళా క్రికెటర్లకు ఐసీసీ గుడ్ న్యూస్.. ప్రసవం తర్వాత రీఎంట్రీకి కొత్త గైడ్‌లైన్స్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 22, 2026
05:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) మహిళా క్రికెటర్ల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. మాతృత్వం కారణంగా మహిళా క్రీడాకారిణుల కెరీర్‌కు ఆటంకం కలగకుండా, ప్రసవం అనంతరం తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌లోకి రావడానికి సహాయపడే ప్రత్యేక మార్గదర్శకాలను సోమవారం విడుదల చేసింది. మాతృత్వం, ప్రొఫెషనల్ క్రికెట్ రెండింటినీ సమర్థవంతంగా సమన్వయం చేసుకునే అవకాశాన్ని కల్పించడమే ఈ కొత్త పాలసీ ప్రధాన లక్ష్యంగా ఐసీసీ పేర్కొంది.

వివరాలు

'6-R' ఫార్ములాతో ప్రత్యేక ప్రణాళిక

ఈ మార్గదర్శకాలలో భాగంగా ఐసీసీ '6-R' ఫార్ములాను ప్రతిపాదించింది. ఇందులో 'రెడీ' (సిద్ధం కావడం), 'రివ్యూ' (సమీక్ష), 'రీస్టోర్' (పునరుద్ధరణ), 'రీకండిషన్' (శారీరక సామర్థ్యాన్ని తిరిగి పెంపొందించడం), 'రిటర్న్' (మళ్లీ ఆటలోకి రావడం) 'రిఫైన్' (పనితీరును మెరుగుపరచడం) అనే ఆరు దశలు ఉన్నాయి. ప్రసవం తర్వాత శారీరకంగా కోలుకోవడం నుంచి ప్రారంభించి, వైద్య సమీక్షలు, దశలవారీగా శిక్షణ పునఃప్రారంభించడం క్రికెట్‌కు అవసరమైన ఫిట్‌నెస్‌ను తిరిగి సాధించడం, పోటీల్లోకి రీఎంట్రీ ఇవ్వడం, అనంతరం ఆరోగ్య పర్యవేక్షణ కొనసాగించడం వరకు అన్ని అంశాలను ఈ ప్రణాళికలో చేర్చారు.

వివరాలు

బిడ్డకు జన్మనివ్వడం కెరీర్‌కు ముగింపు కాదు

ఆస్ట్రేలియా జట్టు వైద్యురాలు, ఐసీసీ మెడికల్ అడ్వైజరీ కమిటీ సభ్యురాలు డాక్టర్ ఫిలిప్పా ఇంగే ఈ మార్గదర్శకాల ప్రాముఖ్యతను వివరించారు. "బిడ్డకు జన్మనివ్వడం క్రీడాకారిణి కెరీర్‌కు ముగింపు కాదని వారికి భరోసా ఇవ్వడమే ఈ గైడ్‌లైన్స్ ప్రధాన ఉద్దేశం. గతంలో అనేక దేశాల క్రికెట్ బోర్డులకు ఇలాంటి విధానాలు లేవు. అందుకే అన్ని దేశాలు తమ అవసరాలకు అనుగుణంగా అనుసరించగలిగేలా ఈ మార్గదర్శకాలను రూపొందించాం. ఇది ఒక టెంప్లేట్‌లా పనిచేస్తుంది. ప్రతి క్రీడాకారిణి, ఆమె కుటుంబ పరిస్థితులకు అనుగుణంగా మద్దతు అందించాల్సి ఉంటుందని ఆమె తెలిపారు.

Advertisement

వివరాలు

ప్రత్యేక కేస్ మేనేజర్ నియామకానికి సిఫార్సు

కొత్త మార్గదర్శకాల ప్రకారం ప్రతి మహిళా క్రికెటర్‌కు ఒక ప్రత్యేక కేస్ మేనేజర్‌ను నియమించాలని ఐసీసీ సూచించింది. సాధారణంగా ఈ బాధ్యతలను డాక్టర్ లేదా ఫిజియోథెరపిస్ట్ నిర్వహిస్తారు. క్రీడాకారిణి గర్భం దాల్చిన నాటి నుంచి తిరిగి మైదానంలోకి అడుగుపెట్టే వరకు ఈ కేస్ మేనేజర్ ఆమెకు ప్రతినిధిగా వ్యవహరిస్తారు. అదనంగా వైద్యులు, ఫిజియోథెరపిస్టులు, సైకాలజిస్టులు, డైటీషియన్లు, కోచ్‌లు, కుటుంబ సభ్యులతో కూడిన సహాయక బృందం ఆమెకు అండగా నిలవాలని ఐసీసీ సూచించింది.

Advertisement

వివరాలు

గోప్యత, వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యం

క్రీడాకారిణుల వ్యక్తిగత గోప్యతకు ఐసీసీ ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చింది. గర్భం దాల్చిన విషయాన్ని ఎప్పుడు వెల్లడించాలనేది పూర్తిగా క్రీడాకారిణి నిర్ణయమేనని స్పష్టం చేసింది. అలాగే సభ్య దేశాల క్రికెట్ బోర్డులు మహిళా ఆటగాళ్లకు తప్పనిసరిగా ప్రెగ్నెన్సీ టెస్టులు నిర్వహించరాదని పేర్కొంది. గర్భధారణ సమయంలో వ్యాయామాన్ని ప్రోత్సహించినప్పటికీ, శిక్షణ లేదా పోటీల్లో పాల్గొనడంపై నిర్ణయాలు వైద్యుల సలహాతోనే తీసుకోవాలని సూచించింది. సాధారణంగా గర్భధారణ తొలి త్రైమాసికం అనంతరం పోటీలకు దూరంగా ఉండాలని సూచించినా, ఎంతకాలం వరకు ఆడవచ్చనే విషయంలో ఎలాంటి కచ్చితమైన నిబంధన విధించలేదని ఐసీసీ స్పష్టం చేసింది.

వివరాలు

అఫీ ఫ్లెచర్ స్వాగతం

2021లో కుమారుడికి జన్మనిచ్చి, ప్రస్తుతం 2026 మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఆడుతున్న వెస్టిండీస్ లెగ్ స్పిన్నర్ అఫీ ఫ్లెచర్ ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. "మహిళా క్రికెటర్ల కోసం ఐసీసీ ఇలాంటి పాలసీ తీసుకురావడం చాలా గొప్ప విషయం. దీని వల్ల కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే కెరీర్‌ను కొనసాగించే అవకాశం ఉంటుంది. ప్రసవం తర్వాత శారీరకంగా కోలుకోవడం ఒక సవాలుగా అనిపించింది. అయితే నా బిడ్డను వదిలి మైదానానికి రావడం మరింత కష్టంగా అనిపించింది. అందుకే మైదానంలో గడిపే ప్రతి క్షణం అతడి కోసమే ఆడతాను. ప్రతి మహిళా క్రీడాకారిణి ప్రయాణం భిన్నంగా ఉంటుంది. సరైన మద్దతుతో ఆరోగ్యంగా మారి, ఈ ప్రక్రియను నమ్మాలని ఆమె తన అనుభవాలను పంచుకున్నారు.

వివరాలు

శిశు సంరక్షణకు కూడా ప్రత్యేక మద్దతు

మహిళా క్రికెటర్లకు మరింత అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు శిక్షణా కేంద్రాల్లో సౌకర్యవంతమైన వాతావరణం, శిశు సంరక్షణకు సంబంధించిన మార్గదర్శకాలు, మైదానాల్లో పిల్లలకు పాలివ్వడానికి లేదా సంరక్షించడానికి ప్రత్యేక గదులు, ప్రయాణ సౌకర్యాలు వంటి పలు ఆచరణాత్మక అంశాలను కూడా ఈ గైడ్‌లైన్స్‌లో చేర్చారు. మహిళా క్రికెట్ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, క్రీడాకారిణులకు మెరుగైన మద్దతు వ్యవస్థ అందించడం అత్యంత అవసరమని ఐసీసీ ప్రతినిధులు పేర్కొన్నారు.

Advertisement