Koneru Hampi: వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌గా కోనేరు హంపి
తెలుగు గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి తన అద్భుత ప్రతిభను మరోసారి చాటుతూ ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో ర్యాపిడ్ ఛాంపియన్‌గా నిలిచింది. ఈ టోర్నీలో 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన హంపి విజయం సాధించింది. 2019లో కూడా హంపి ర్యాపిడ్ ఛాంపియన్‌గా నిలిచింది. చైనా గ్రాండ్‌మాస్టర్ జు వెంజున్ తర్వాత, ఒకటి కంటే ఎక్కువసార్లు ఈ టైటిల్‌ను గెలుచుకున్న ప్లేయర్‌గా హంపి ప్రత్యేక ఘనతను సాధించింది.
ఐదో స్థానంలో ద్రోణవల్లి
మరో తెలుగు గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ఐదో స్థానంలో నిలిచింది. పురుషుల విభాగంలో, తొమ్మిది రౌండ్లు ముగిసే సరికి అగ్రస్థానంలో ఉన్న భారత గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేసి చివరలో వెనుకపడిపోయాడు. పురుషుల ర్యాపిడ్ ఈవెంట్‌లో 18 ఏళ్ల రష్యన్ గ్రాండ్‌మాస్టర్ వోలాదర్ ముర్జిన్ 10 పాయింట్లతో విజేతగా అవతరించాడు. అర్జున్ 9 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచాడు.