Surya Kumar Yadav: హ్యాపీ బర్తడే 'SKY'.. సూర్యకుమార్ యాదవ్ టాప్ రికార్డులివే!
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ క్రికెట్‌లో అగ్రీసివ్ షాట్లు ఆడుతూ పేరు సంపాదించుకున్నాడు. భారత జట్టు టీ20 వరల్డ్ కప్ గెలవడానికి సూర్య కుమార్ యాదవ్ కీలక పాత్ర పోషించారు. 31 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసి భారత అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరిగా పేరు సంపాదించాడు. అతన్ని అభిమానులు ముద్దుగా 'మిస్టర్ 360' అని పిలుస్తారు. ఇవాళ సూర్యకుమార్ యాదవ్ 34వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. అయితే క్రికెట్‌లో అతను సాధించిన ఘనతల గురించి ఓ సారి తెలుసుకుందాం.
16 సార్లు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు
అంతర్జాతీయ టీ20లో అత్యధిక సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న ఆటగాడిగా సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు. 71 మ్యాచ్‌ల్లో 16 సార్లు ఈ అవార్డును గెలుచుకుని ప్రపంచ రికార్డు సృష్టించాడు. 2022లో 31 మ్యాచ్‌లలో 1164 పరుగులు చేసి, ఒక క్యాలెండర్ ఇయర్‌లో టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా సూర్యకుమార్ రికార్డుకెక్కాడు. సూర్యకుమార్ టీ20లో నాలుగు సెంచరీలు చేసిన మూడో ఆటగాడిగా నిలిచాడు. అతనికంటే ముందు రోహిత్ శర్మ (5), గ్లెన్ మాక్స్‌వెల్ (5) ఉన్నారు.
అత్యధిక సిక్సర్లు బాదిన ఐదో ఆటగాడిగా సూర్యకుమార్ యాదవ్
ఇప్పటివరకు 71 మ్యాచ్‌ల్లో 68 ఇన్నింగ్స్‌లలో 168.65 స్ట్రైక్ రేట్‌తో 2332 పరుగులు చేశాడు. సూర్యకుమార్ టీ20లో అత్యధిక సిక్సర్లు బాదిన ఐదో ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటి వరకు అతను 136 సిక్సర్లు కొట్టాడు. 24 హాఫ్ సెంచరీలు చేసిన సూర్యకుమార్, అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో ఏడో స్థానంలో ఉన్నాడు.