Harbhajan Singh : మళ్లీ తెరపైకి ఐపీఎల్‌లో చెంపదెబ్బ వివాదం .. హర్భజన్‌పై శ్రీశాంత్ ఫైర్
ఈ వార్తాకథనం ఏంటి
తొలి ఐపీఎల్ సీజన్‌లో మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, శ్రీశాంత్ మధ్య జరిగిన 'చెంపదెబ్బ' వివాదం ఇప్పటికీ చర్చల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా ఈ ఘటనపై మాజీ పేసర్ శ్రీశాంత్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ సంఘటనను ఆధారంగా చేసుకుని హర్భజన్ సింగ్ సుమారు రూ.కోటి వరకు సంపాదించాడని ఆయన ఆరోపించాడు. ఈ విషయాలను ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
వివరాలు
ఫైర్ అయిన శ్రీశాంత్..
శ్రీశాంత్ మాట్లాడుతూ, ''భజ్జీ గురించి నేను ఇప్పటివరకు ఎలాంటి ఇంటర్వ్యూలోనూ మాట్లాడలేదు. బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. అప్పటి చెంపదెబ్బ ఘటనను నేను చాలా కాలం క్రితమే పట్టించుకోవడం మానేశాను. అయితే ఇటీవల హర్భజన్ ఆ సంఘటనను ఆధారంగా చేసుకుని ఒక ప్రకటనలో నటించాడు. ఆ ప్రకటన ద్వారా అతడు రూ.కోటి వరకు ఆదాయం పొందాడు. అంతేకాకుండా ఆ యాడ్‌ను సోషల్ మీడియాలో నేను కూడా షేర్ చేయాలని ఫోన్ చేసి కోరాడు. అప్పుడు నేను అతడికి ఒకటే చెప్పాను... 'నేను నిన్ను క్షమిస్తాను, కానీ ఆ సంఘటనను ఎప్పటికీ మర్చిపోలేను' అని. మన జీవితంలో ఎవరి వల్లైనా చెడు జరిగితే, వారిని క్షమించవచ్చు.
వివరాలు
అతడి ప్రవర్తన అంతా నటనే..
కానీ జరిగిన చెడును మాత్రం మరవకూడదు. ఒకవేళ మరిచిపోతే, ఎదుటివారు మళ్లీ అదే తప్పును చేసే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో భజ్జీనే మంచి ఉదాహరణ'' అని శ్రీశాంత్ వ్యాఖ్యానించాడు. అతడు ఇంకా మాట్లాడుతూ, ''ఇటీవల చాలా ఇంటర్వ్యూల్లో హర్భజన్ ఈ ఘటన గురించి మాట్లాడాడు. తాను పెద్ద తప్పు చేశానని చెప్పుకుంటూ సానుభూతి పొందేందుకు ప్రయత్నించాడు. నా కుమార్తె గురించి కూడా ప్రస్తావించాడు. వ్యక్తిగతంగా నాకు అతనిపై ఎలాంటి ద్వేషం లేదు. కానీ ఒకటి రెండు నెలల క్రితం ఈ ప్రకటన చేసిన తర్వాత నేను అతడిని ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లాక్ చేశాను. అప్పుడే అతడి ప్రవర్తన అంతా నటన మాత్రమేనని నాకు అర్థమైంది'' అని తీవ్రంగా విమర్శించాడు.