LOADING...
Hardik Pandya: ముంబై పరాజయానికి కారణం హార్దిక్ నిర్ణయాలేనా? సెహ్వాగ్ షాకింగ్ కామెంట్
ముంబై పరాజయానికి కారణం హార్దిక్ నిర్ణయాలేనా? సెహ్వాగ్ షాకింగ్ కామెంట్

Hardik Pandya: ముంబై పరాజయానికి కారణం హార్దిక్ నిర్ణయాలేనా? సెహ్వాగ్ షాకింగ్ కామెంట్

వ్రాసిన వారు Moogati Shabari
May 01, 2026
04:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారీ లక్ష్యాన్ని రక్షించడంలో విఫలమైన ముంబయి ఇండియన్స్ జట్టు, సన్‌ రైజర్స్ హైదరాబాద్ చేతిలో చేదు పరాజయాన్ని ఎదుర్కొంది. పిచ్‌పై బౌలర్లకు పెద్దగా సహాయం లేకపోయినా, కెప్టెన్‌గా హార్దిక్ పాండ్య తీసుకున్న కొన్ని నిర్ణయాలు మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, మురళీ కార్తీక్ ను ఆశ్చర్యానికి గురి చేశాయి. ముఖ్యంగా, ఇంపాక్ట్ ప్లేయర్‌గా శార్దూల్ ఠాకూర్ ను జట్టులోకి తీసుకొచ్చినా, అతనికి ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ ఇవ్వకపోవడం కార్తిక్ విమర్శలకు దారితీసింది. ఈ అంశంపై సెహ్వాగ్ కూడా స్పందించాడు. కాస్త ఘాటుగానే రియాక్ట్ అయ్యాడు.

వివరాలు

సెహ్వాగ్ ఏమన్నాడంటే..

మురళీ కార్తిక్ మాట్లాడుతూ, "నాకు ఇంకా స్పష్టంగా అర్థం కానిది ఏమిటంటే, శార్దూల్‌ను వారు ఒక ఆప్షన్‌గా తీసుకొచ్చారు. అయితే, అతడిని పూర్తిగా ఉపయోగించకపోవడం ఎందుకు అన్నది తెలియడం లేదు. అతడిని మరిచిపోయారా? లేక ఏదైనా ప్రత్యేక కారణం ఉందా? నా ముఖంలో కూడా అదే సందేహం కనిపిస్తోంది" అని పేర్కొన్నారు. దీనికి సరదాగా స్పందించిన సెహ్వాగ్, "నాకు ఆ రెడ్‌బుల్ క్యాన్ ఇవ్వండి. ముందుగా కార్తిక్‌పై స్ప్రే చేసి, తర్వాత విషయం వెతుకుతాను" అని చమత్కరించాడు.

వివరాలు

బౌలింగ్ అవకాశం ఇవ్వాల్సింది: సెహ్వాగ్

సెహ్వాగ్ మాట్లాడుతూ.. "మీరు ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఒక బ్యాటర్ లేదా బౌలర్‌ను ఎంపిక చేసుకున్నప్పుడు, అతడిని ఉపయోగించడం అవసరం. శార్దూల్‌కు కనీసం ఒక ఓవర్ అయినా ఇచ్చి ఉండాల్సింది. అతడు వికెట్లు తీసే సామర్థ్యం ఉన్న బౌలర్. కనీసం అతడిని ప్రయత్నిద్దామనే ఆలోచన కూడా రాకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు అవకాశం ఇవ్వలేదో హార్దిక్‌ను అడగాల్సిందే" అని వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ముంబయి ఇండియన్స్ జట్టు ఎనిమిది మ్యాచ్‌లు ఆడి కేవలం రెండు విజయాలే సాధించింది. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది.

Advertisement