Hardik Pandya : చివరి లీగ్ మ్యాచ్ వరకూ హార్ధిక్ పాండ్యా ఆడేది డౌటే!
చీలమండ గాయం నుంచి టీమిండియా స్టార్ బ్యాటర్ హర్థిక్ పాండ్యా కోలుకుంటున్న విషయం తెలిసిందే. అయితే వరల్డ్ కప్‌లో నెదర్లాండ్స్‌తో జరిగే చివరి లీగ్ మ్యాచ్ వరకు కూడా హార్ధిక్ పాండ్యా అందుబాటులోకి వచ్చేది అనుమానంగానే ఉంది. నవంబర్ 12న నెదర్లాండ్స్, టీమిండియా చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. అప్పటివరకూ అతన్ని పక్కన పెట్టే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచులో హార్ధిక్ పాండ్యా కాలి మడమకు గాయమైంది.దీంతో న్యూజిలాండ్, ఇంగ్లండ్‌తో జరిగిన కీలక మ్యాచులకు అతను దూరమయ్యాడు. రేపు శ్రీలంక, 5న సౌతాఫ్రికాతో జరిగే మ్యాచుకు కూడా పాండ్యా ఆడేది అనుమానంగానే ఉందని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.
గాయం నుంచి వేగంగా కోలుకుంటున్న పాండ్యా
నవంబర్ 12న బెంగళూరులో నెదర్లాండ్స్‌తో జరిగే చివరి లీగ్ మ్యాచుకు హార్ధిక్ పాండ్యా అందుబాటులో వచ్చే ఛాన్స్ ఉందని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. పాండ్యా గాయం నుంచి వేగంగా కోలుకుంటున్నాడని, ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్నాడని పేర్కొన్నాడు. అతని భవిష్యత్ గురించి మరికొన్ని రోజుల్లో ప్రకటన వస్తుందని వెల్లడించారు. ఇదిలా ఉండగా, ఈ మెగా టోర్నీలో భారత్ వరుసగా ఆరు విజయాలు సాధించి, 12 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.