Hardik Pandya: ముంబై ఓటమి తర్వాత హార్దిక్ పాండ్య పెద్ద మనసు.. బౌలర్లపై నిందలు మోపని కెప్టెన్
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ముంబయి ఇండియన్స్‌కు ఎదురైన ఓటమి తర్వాత కెప్టెన్ హార్దిక్ పాండ్య తన ఒక్క స్టేట్‌మెంట్‌తో నాయకత్వ లక్షణాలను మరోసారి చాటుకున్నారు. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ నమోదు చేసినప్పటికీ విజయం సాధించలేకపోయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై 5 వికెట్లకు 243 పరుగులు చేసింది. అయితే ఆ లక్ష్యాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇంకా 8 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ముఖ్యంగా ముంబై కీలక బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్‌లో నిరాశపరిచాడు. తన నాలుగు ఓవర్లలో 54 పరుగులు ఇచ్చి వికెట్ తీసుకోలేకపోయాడు.
వివరాలు
మరింత క్లిష్టంగా ముంబై ఇండియన్స్..
ఈ ఓటమితో ముంబై ఇండియన్స్ పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ఇప్పటివరకు 8 మ్యాచ్‌లలో కేవలం 4 పాయింట్లతోనే నిలిచిపోయింది. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ 9 మ్యాచ్‌లలో 12 పాయింట్లతో మూడో స్థానానికి ఎగబాకింది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన హార్దిక్ పాండ్య తన జట్టును తప్పుబట్టకుండా పెద్ద మనసు చూపించాడు. బౌలర్లపై నిందలు మోపబోనని స్పష్టం చేశాడు. "ఈ సీజన్‌లో మాకు చాలా ఆప్షన్స్ లేవు. పరిస్థితుల్లో మార్పులు తీసుకురావడానికి మార్గాలు వెతకాలి. బౌలర్లను తప్పుబట్టను. మొత్తం జట్టుగా ముంబై ఇండియన్స్ స్టాండర్డ్‌కు తగ్గ ప్రదర్శన చేయలేకపోయాం" అని అన్నారు. ఇంకా మాట్లాడుతూ "మేము ఏం మెరుగుపరుచుకోవాలో కచ్చితంగా ఆలోచించాలి" అని చెప్పారు.
వివరాలు
పాండ్యా ఏమన్నాడంటే..
జట్టు యాజమాన్యం, సపోర్ట్ స్టాఫ్ మద్దతుతో ఈ పరిస్థితి నుంచి బయటపడతామని పాండ్య విశ్వాసం వ్యక్తం చేశాడు. "మాకు మంచి యజమానులు, సపోర్ట్ స్టాఫ్ ఉన్నారు. త్వరలోనే పరిష్కారం కనుగొంటామని ఆశిస్తున్నాం" అని తెలిపారు. ముంబై అభిమానుల గురించి కూడా పాండ్య స్పందించాడు. వారికి తగిన ఆనందం ఇవ్వలేకపోయామని అంగీకరించాడు. "మా అభిమానులు ఎంతో విశ్వాసంగా మాకు మద్దతు ఇస్తున్నారు. కానీ మేము వారికి గెలుపులతో ఆనందం ఇవ్వలేకపోయాం. ప్రత్యర్థి జట్టు అభిమానులు స్టేడియంలో శబ్దం చేయడం కొన్నిసార్లు బాధ కలిగిస్తుంది. అందుకే వారికి మరింత సంతోషం ఇచ్చేలా ఆడాలి" అని చెప్పాడు.
వివరాలు
సంతృప్తి వ్యక్తం చేసిన కెప్టెన్..
అయితే జట్టు బ్యాటింగ్‌పై పాండ్య సంతృప్తి వ్యక్తం చేశాడు. "ఈ రోజు బ్యాటింగ్ చాలా బాగా సాగింది. 244 పరుగులు చేసిన తర్వాత సాధారణంగా మా బౌలర్లపై నమ్మకం ఉంటుంది. కానీ ఈ రోజు మేము ప్లాన్‌ను అమలు చేయలేకపోయాం" అని అన్నాడు. ఫీల్డింగ్‌లో జరిగిన తప్పిదాలు కూడా ప్రభావం చూపాయని ఆయన పేర్కొన్నారు. "ఈ సీజన్ అంతా మిస్ అయిన అవకాశాలే ఎక్కువ. క్యాచ్‌లు పట్టాల్సిన సమయంలో పట్టుకుంటే మ్యాచ్ మలుపు తిరుగుతుంది. లేకపోతే అదే మాకు నష్టం అవుతుంది. అయినప్పటికీ ప్రతి ఆటగాడు తన వంతు కృషి చేశాడు, కానీ ఫలితం రాలేదు" అని వివరించాడు.
వివరాలు
వారిని ప్రశంసించిన పాండ్యా..
ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తన జట్టు ఆటతీరును ప్రశంసించాడు. ముఖ్యంగా ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్‌పై ప్రశంసలు కురిపించాడు. "పిచ్ అనుకూలంగా ఉంటే వారు ఎన్నో షాట్లు ఆడగలరు. వారికి బౌలింగ్ చేయాల్సి రాకపోవడం నాకు సంతోషం" అని అన్నారు. జట్టులోని యువ ఆటగాళ్లు దూకుడు వైఖరితో ఆడుతున్నారని, అదే వారి బలం అని తెలిపారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన హెన్రిచ్ క్లాసెన్ కూడా తన ఇన్నింగ్స్ గురించి స్పందించాడు. కీలక సమయంలో క్రీజ్‌లోకి వచ్చి జట్టును గెలిపించిన అతను ప్రారంభంలోనే రిస్క్ తీసుకున్నానని చెప్పాడు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ వేగంగా పరుగులు చేయడం వల్ల తన పని సులభమైందని క్లాసెన్ పేర్కొన్నాడు.