టెస్టుల్లోకి హార్ధిక్ పాండ్యా రీ ఎంట్రీ.. బీసీసీఐ క్లారిటీ..!
టీమిండియా స్టార్ ఆలౌరౌండర్ హార్ధిక్ పాండ్యా టెస్టులో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత హార్ధిక్ వన్డేలు, టీ20లను మాత్రమే ఆడతున్నాడు. ప్రస్తుతం టెస్టు జట్టులో పేస్ ఆల్ రౌండర్ లేని చోటు కనిపిస్తుండటంతో మళ్లీ అతడిని టెస్టు క్రికెట్లోకి తీసుకురావాలని బీసీసీఐ ఆలోచిస్తోంది. దీనిపై బీసీసీఐ టెస్టు ఛాంపియన్ షిఫ్ ఫైనల్‌కు ముందు హార్ధిక్‌తో చర్చించే అవకాశం కన్పిస్తోంది. పాండ్యాను టెస్టుల్లోకి తీసుకురావాడనికి తొందరపడడం లేదని, అయితే ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ కు ముందు దీని గురించి పాండ్యాతో మాట్లాడుతామని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.
2018లో చివరిసారిగా టెస్టు మ్యాచ్ ఆడిన పాండ్యా
ప్రస్తుతం రిషబ్ పంత్, జస్ప్రిత్ బుమ్రా గైర్హాజరీతో భారత్ జట్టు టెస్టు క్రికెట్ ఆడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో హార్ధిక్ పాండ్యాను టెస్టుల్లో ఆడిస్తే లాభదాయకంగా ఉంటుందని టీమిండియా భావిస్తోంది. ప్రస్తుతం పాండ్యా టెస్టు జట్టులో లేరని, అతని గాయాల చరిత్రను తెలుసుకోవాలని, అయితే ఎన్‌సీఏ, మెడికల్ టీమ్, హార్దిక్ పాండ్యా స్వయంగా టెస్టుల్లో రీఎంట్రీకి సిద్ధంగా ఉన్నారని భావిస్తే అతను కచ్చితంగా టెస్టు మ్యాచ్ లు ఆడుతాడని బీసీసీఐ అధికారి స్పష్టం చేశారు. హార్దిక్ పాండ్యా చివరిసారిగా 2018లో ఇంగ్లండ్ పర్యటనలో టెస్టు మ్యాచ్ ఆడాడు. ఇప్పటివరకు 11 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 532 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలు వచ్చాయి. బౌలింగ్‌లో 17 వికెట్లు తీశాడు.