Harley Davidson X210 : అతి చౌక ధరతో హార్లీ డేవిడ్‌సన్ బైక్ వచ్చేస్తోంది..!
దిగ్గజ ఆటో మొబైల్ సంస్థ హార్లీ డేవిడ్‌సన్ ఇండియన్ మార్కెట్‌పై దృష్టి సారించింది. ఇప్పటికే హీరో మోటోకార్ప్‌తో కలిసి ఎక్స్ 440 రోడ్ స్టర్‌ను ఇండియాలో లాంచ్ చేసింది. తాజాగా మరో బైకును లాంచ్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. హార్లీ డేవిడ్‌సన్ ఎక్స్ 210ని చౌకగా ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నట్లు తెలుస్తోంది. ఇక రాజస్థాన్ జైపూర్‌లో ఈ వెహికల్‌కి సంబంధించిన టెస్ట్ డ్రైవ్ కూడా పూర్తి అయిపోయింది. తాజాగా ఈ బైక్ వివరాల గురించి తెలుసుకుందాం. హార్లీ డేవిడ్‌సన్ ఎక్స్ 210 డిజైన్ పూర్తిగా ఎక్స్ 440ని పోలి ఉండొచ్చు. ఇక ఎక్స్ 440కి ఇది మినీ వర్షెన్ గా కూడా ఉండొచ్చని టాక్ నడుస్తోంది.
హార్లీ డేవిడ్ సన్ కొత్త బైకు గురించి ఎటువంటి ప్రకటన ఇవ్వని సంస్థ
ఈ బైకులో 210 సీసీ, లిక్విడ్ కూల్డ్, డీఓహెచ్‌సీ, సింగిల్ సిలిండర్ ఇంజిన్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. ఇది 25 హెచ్ పీ పవర్‌ను, 204 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ బైకులో కూడా 6 స్పీడ్ మేన్యువల్ గేర్ బాక్స్ లభించొచ్చు. సబ్-300 సీసీ సెగ్మెంట్‌కు ఇండియాలో కనిపిస్తున్న డిమాండ్ ను క్యాష్ చేసుకోవాలని హార్లీ డేవిడ్ సన్ సంస్థ భావిస్తోంది. అందుకే ఈ బైకును తక్కువ ధరకు విక్రయించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ బైక్ గురించి ఆ సంస్థ ఎటువంటి ప్రకటన చేయలేదు. త్వరలో దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.